Telangana: అయ్య బాబోయ్.. ఈ పుంజుకు 4 కాళ్లు.. బరిలోకి దింపితే కత్తి ఎక్కడ కట్టాలి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం గ్రామంలో నాలుగు కాళ్లతో ఉన్న కోడి పుంజు ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. స్థానిక రైతు ప్రసాద్ తోటలో పందెం కోసం పెంచిన పుంజుల్లో ఒకటి జన్యుపరమైన లోపంతో నాలుగు కాళ్లతో పుట్టింది. ...

ఈ సృష్టి ఎన్నో వింతల సమాహారం. అయితే కొన్నిసార్లు జన్యపరంగా జరిగే లోపాలను కూడా అద్భుతాలుగా భావిస్తారు జనం. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు కాళ్లతో ఉన్న కోడి పుంజును జనం ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. దాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా జనం వస్తున్నారు. కొన్నిసార్లు ఆవులు, కుక్కలు, ఇతర జీవులు… రెండు తలలు, మూడు కాళ్లతో ఉన్న పిల్లలకు జన్మనివవ్వడం చూస్తుంటాం. తాజాగా అలానే ఈ పుంజు కూడా నాలుగు కాళ్లతో పుట్టి పెరిగి పెద్దదయింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెం గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం తన తోటలో పందెం పుంజులు పెంపకం ప్రారంభించాడు. వేరే ప్రాంతం నుంచి కొని తెచ్చిన వాటిలో.. ఒక పుంజుపిల్ల విచిత్రంగా ఉండటంతో దానిని శ్రద్ధగా పెంచాడు. ఇంకో 2 నెలలలో సంక్రాంతి పండుగ వస్తున్నందున పందెం రాయుళ్లు పుంజులను చూడటానికి ప్రసాద్ తోటకి వచ్చారు. వాటిలో ఒక పుంజును చూసి అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఎందుకంటే ఈ పుంజు నాలుగు కాళ్లతో జన్మించి, మంచి హుషారుగా ఉండటం చూసి విస్తుపోతున్నారు. వామ్మో ఇదేం పుంజు.. ఒకవేళ కోడి పందెలలో పాల్గొంటే దీనికి ఎక్కడ కత్తులు కట్టాలి, దీన్ని చూసి మిగతా పుంజులు పోరాడగలవా అని చర్చించుకుంటున్నారు. ఈ నాలుగు కాళ్ల పుంజు గురించి తెలిసిన వారందరూ దీన్ని చూడటానికి ఎగబడుతున్నారు. ఏమైనా బ్రహ్మం గారు చెప్పినట్లే జరుగుతుంది అని కొందరు, ఇదేం వింతరా బాబు అని మరికొందరు, ఇంకా ఇలాంటి వింతలు చూడాలో అని స్థానికంగా చర్చ జరుగుతోంది.
వీడియో దిగువన చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




