TGSRTC: కర్నూలు ప్రమాదం ఎఫెక్ట్.. ప్రయాణికుల సేఫ్టీకి తెలంగాణ ఆర్టీసీ పెద్దపీట
కర్నూలు సమీపంలో ఇటీవల ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో.. ఇలాంటి ఘటనలు జరగకుండా తెలంగాణ ఆర్టీసీ ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ప్రయాణికులకు అందిస్తున్న సురక్షిత రవాణా సేవలను సంస్థ వీసీ అండ్ ఎండీ నాగిరెడ్డి మరోసారి పరిశీలించారు. ఈ మేరకు ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.

కర్నూలు సమీపంలో ఇటీవల ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురై 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడంతో.. ఇలాంటి ఘటనలు జరగకుండా తెలంగాణ ఆర్టీసీ ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు టీజీఎస్ఆర్టీసీ వీసీ, ఎండీ నాగిరెడ్డి పలు సూచనలు చేశారు. సోమవారం మియాపూర్-1 డిపోను ఆయన సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. మియాపూర్ -1 డిపోలోని లహరి స్లీపర్,లహరి ఏసి స్లీపర్ కం సీటర్,రాజధాని, సూపర్ లగ్జరీ బస్సులను తనిఖీ చేసి అందులో అమర్చబడిన ఫైర్ సేఫ్టీ కి సంబంధించిన ఫైర్ డిటెక్షన్ అలారం, ఫైర్ సప్రెషన్ సిస్టంల పనితీరును పరిశీలించారు.
అంతేకాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన స్టాండర్డ్ ప్రోటకాల్ పద్ధతులను సిబ్బంది, అధికారులతో సమీక్షించారు. ప్రయాణ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. బస్సులన్నింటిలో ఎమర్జెన్సీ డోర్లు, అద్దాలను పగలగొట్టేందుకు అవసరమైన సంఖ్యలో బ్రేకర్లు, అగ్నిమాపక పరికరాలు తదితర ఏర్పాట్లు అన్ని వేళల్లో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సులు బయలుదేరే ముందు ప్రయాణికులకు వెల్కమ్ మెసేజ్ తో పాటు సేఫ్టీకి సంబంధించిన వివరాలు కూడా తెలియచెప్పాలని సూచించారు. ఏదైనా ప్రమాదం సంభవించినట్లయితే ముందుగా ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేయాలని తెలిపారు. ప్రయాణికులకు నిరంతరం సురక్షితమైన రవాణా సేవలను అందించేందుకు సిబ్బంది ఎల్లవేళలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సురక్షిత ప్రయాణాన్ని అందిస్తోందని, సేఫ్ జర్నీతోనే ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ మరవకూడదని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




