Tirumala: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ.. 100 ఎకరాల్లో..
దేశంలోనే తొలిసారిగా టీటీడీ 100 ఎకరాల్లో దివ్య వృక్షాల ప్రాజెక్ట్ ప్రారంభించింది. ధ్వజస్తంభ నిర్మాణానికి అవసరమైన పవిత్ర వృక్షాలను స్వయంగా పెంచి, సంరక్షించడం దీని లక్ష్యం. ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఈ ప్రాజెక్ట్ ప్రాధాన్యతనిస్తుంది. టీటీడీ ఆలయాలకు అవసరమైన కలపను అందిస్తూ, భవిష్యత్ తరాలకు సంప్రదాయాలను, ప్రకృతిని అందివ్వడమే ఈ వినూత్న ప్రయత్నం యొక్క ముఖ్య ఉద్దేశం.

దేశంలోనే తొలిసారిగా ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు. ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ప్రాచీన, ఆగమ శాస్త్రాలకు అనుగుణమైన హిందూ దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను టీటీడీ స్వయంగా పెంచి, పరిరక్షించి వినియోగించడమేనన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు ఇది నిదర్శనమని బీ.ఆర్ నాయుడు అన్నారు.
ధ్వజస్తంభానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం
ధ్వజస్తంభం కేవలం నిర్మాణాత్మక అంశం మాత్రమే కాదు. అది భౌతిక లోకానికి, దైవ లోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచి ఉండే ధ్వజస్తంభం భక్తి, పవిత్రత, దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుంది. ఆగమశాస్త్రాల ప్రకారం ధ్వజస్తంభం నిటారుగా పెరిగిన ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో తయారు చేయాలి. ఆ వృక్షాన్ని ఆధ్యాత్మిక, జ్యోతిష్య, విధి విధానాలకు అనుగుణంగా ఎంపిక చేసి, ఏళ్ల తరబడి సంరక్షించి, ఆపై శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వినియోగిస్తారు.
ధ్వజస్తంభాల కోసం ఉపయోగించే పవిత్ర వృక్షాలు
ఆగమ సంప్రదాయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఏగిశా (ఇండియన్ కినో), టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారు. ఇవి బలంగా, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. పరిపక్వత చెందిన తర్వాత ఆ వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించి, ఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు. అనంతరం దానిని కవచంతో కప్పి, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం లాంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. ఇక రాజగోపురం, గర్భగుడి విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని ప్రకటించే ఈ ధ్వజారోహణం సమస్త లోకాల్లోని దేవతలను ఆహ్వానించే శుభ సూచకంగా నిలుస్తుంది.
దివ్య వృక్షాల పెంపకంపై టీటీడీ దూరదృష్టి
ఇక దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను టీటీడీ నిర్వహిస్తోంది. భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించే బాధ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును అత్యంత దూరదృష్టితో ప్రారంభిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా కాలక్రమేణ మార్పు అవసరమైన ధ్వజస్తంభాల స్థానంలో శాస్త్రోక్తంగా కొత్త ధ్వజస్తంభాలను ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో టీటీడీ నిర్మించనున్న ఆలయాలకు అవసరమైన ధ్వజస్తంభాల కోసం పవిత్రమైన కలపను ముందుగానే సిద్ధం చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
దివ్య వృక్షాల ప్రాజెక్టు వివరాలు ఇవే
ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో భాగంగా సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో దివ్య వృక్షాల ప్రాజెక్టు కోసం కేటాయించాలని టీటీడీ బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు అమలుతో, ధ్వజస్తంభాల కోసం అవసరమైన దివ్య వృక్షాలను స్వయంగా పెంచే తొలి దేవాలయ సంస్థగా టీటీడీ దేశంలో చరిత్ర సృష్టించనుంది. దీని ద్వారా ఆగమ శుద్ధి, ఆధ్యాత్మిక పవిత్రత, పర్యావరణ బాధ్యత, సంస్థాగత స్వావలంబనను తరతరాలకు కొనసాగించగలుగుతామని టీటీడీ స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




