Intermediate: ఇకపై ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులకూ ప్రాక్టికల్ పరీక్షలు షురూ.. ఎప్పట్నుంచంటే?
Telangana BIE major reforms In Intemediate Education: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో రేవంత్ సర్కార్ పలు మార్పులు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి పతు ప్రతిపాదనలు పంపింది. వాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబరు 23న పచ్చజెండా ఊపడంతో మార్గం సుగమమైంది. ఇంటర్ బోర్డు చేపట్టిన కొత్త సంస్కరణలు..

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో రేవంత్ సర్కార్ పలు మార్పులు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఇంటర్‌బోర్డు ప్రభుత్వానికి పతు ప్రతిపాదనలు పంపింది. వాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్టోబరు 23న పచ్చజెండా ఊపడంతో మార్గం సుగమమైంది. ఇంటర్ బోర్డు చేపట్టిన కొత్త సంస్కరణలు అన్నీ 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ సంస్కరణల్లో భాగంగా ఇప్పటివరకు కేవలం ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మాత్రమే నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకూ ఇంటర్ బోర్డు నిర్వహించనుంది. దీనితో పాటు ఇంటర్ విద్యావిధానంలో మరికొన్ని మార్పులు రానున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌లో అన్ని సబ్జెక్టుల్లో 80 శాతం మార్కులను రాత పరీక్షకు, మిగిలిన 20 శాతం మార్కులు ఇంటర్నల్ పరీక్షలకు కేటాయిస్తారు. ప్రస్తుతం ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు మాత్రమే ఇంటర్నల్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇక నుంచి సంస్కృతం, తెలుగు, గణితం, సోషల్ వంటి అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు కేటాయించనున్నారు. అలాగే ప్రాక్టికల్స్ ఉన్న సబ్జెక్టులకు కూడా ఇంటర్నల్ మార్కులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సెకండియర్‌లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై ఫస్టియర్‌లో కూడా ప్రాక్టికల్స్ ప్రవేశపెడతారు. దీంతో ప్రస్తుతం ఉన్న మార్కులను రెండు సంవత్సరాలకు సగం, సగం చొప్పున కేటాయిస్తారు.
అలాగే ప్రస్తుతం ఎంపీసీ గ్రూపులో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు 30 చొప్పున ప్రాక్టికల్స్‌కు మార్కులు కేటాయిస్తున్నారు. ఇకపై ఫస్ట్ ఇయర్‌లో ఒక సబ్జెక్టుకు 15, సెకండ్ ఇయర్‌లో 15 మార్కులకు ఈ ప్రాక్టికల్స్ మార్కులను నిర్వహిస్తారు. బైపీసీ గ్రూపులో ఒక్కో సబ్జెక్టుకు 30 చొప్పున నాలుగు సబ్జెక్టులకు 120 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇప్పటి వరకూ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు లేకపోవడం వల్ల ఏకంగా ఏడాది మొత్తం ల్యాబ్‌ల వైపు వెళ్లడం లేదు. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తెచ్చేందుకు ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంటర్‌లో ఏసీఈ అనే కొత్త గ్రూపును ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు ఉంటాయి. ప్రస్తుతం సీఈసీ గ్రూపులో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులు ఉంటున్నాయి. ఎకౌంటెన్సీకి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త గ్రూపును తీసుకువస్తున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే ఇంటర్ సిలబస్‌లోనూ మార్పులు చేయనున్నారు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల సిలబస్ తగ్గే అవకాశం ఉంది. పాఠ్య పుస్తకాల్లో కొత్తగా క్యూఆర్ కోడ్ సైతం ముద్రించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








