AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోక్ సభ ఎన్నికల వేళ తెరపైకి ఆదివాసీ వర్సెస్ బంజారా.. తెరపైకి కీలకపరిణామం

అడవుల జిల్లా ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‎లో ఇప్పుడు రసవత్తర రాజకీయానికి తెర లేపింది. పార్లమెంట్ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్ని ఆదివాసీ నేతలకే జై‌కొట్టడంతో బంజారా సామాజిక వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. అన్ని పార్టీలు కట్టకట్టుకొని తమ సమాజాన్ని దెబ్బ తీయాలని ఫిక్స్ అయ్యాయంటూ ఆగ్రహంతో ఊగిపోతూ రహస్య చర్చలకు తెర లేపింది.

లోక్ సభ ఎన్నికల వేళ తెరపైకి ఆదివాసీ వర్సెస్ బంజారా.. తెరపైకి కీలకపరిణామం
Adilabad
Naresh Gollana
| Edited By: |

Updated on: Mar 27, 2024 | 9:36 PM

Share

అడవుల జిల్లా ఆదివాసీల ఖిల్లా ఆదిలాబాద్‎లో ఇప్పుడు రసవత్తర రాజకీయానికి తెర లేపింది. పార్లమెంట్ ఎన్నికలకు ప్రధాన పార్టీలన్ని ఆదివాసీ నేతలకే జై‌కొట్టడంతో బంజారా సామాజిక వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. అన్ని పార్టీలు కట్టకట్టుకొని తమ సమాజాన్ని దెబ్బ తీయాలని ఫిక్స్ అయ్యాయంటూ ఆగ్రహంతో ఊగిపోతూ రహస్య చర్చలకు తెర లేపింది. తమ ఉనికిని కాపాడుకోవాలంటే రాజకీయంగా బ్రతికుండాలంటే సమాజం అంతా ఏకమవ్వాలనే ఓ నిర్ణయానికొచ్చింది. ఫలితంగా బలం బలగం ఉన్న బంజారా సామాజికవర్గ నేతను పార్టీలకు అతీతంగా స్వంతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎంపిగా బరిలో నిలపాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ డైలామాలో పడగా.. ఇంకా టికెట్ ఖరారు చేయని అధికార కాంగ్రెస్ పార్టీ సైతం యూటర్న్ తీసుకునే ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది.

ఆదిలాబాద్ ఎంపి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపి సోయం బాపురావును కాదని మాజీ ఎంపి గొడెం నగేష్‎ను ఫైనల్ చేసింది బీజేపీ. అటు బీఆర్ఎస్ సైతం ఆదివాసీ నేత ఆత్రం సక్కుకే అభ్యర్థిగా పట్టం కట్టింది. అదే బాటలో కాంగ్రెస్ సైతం ఆదివాసీ అభ్యర్థినే ఎంపి ‌బరిలో నిలపాలని అయితే బీజేపీ , బీఆర్ఎస్ లాగా కాకుండా మహిళా ఆదివాసీ నేతకు జై కొట్టాలని ఫిక్స్ అయింది. అందులో భాగంగానే ఆదివాసీ ఉపాధ్యాయురాలు ఆదివాసీల హక్కుల పోరాట నేత ఆత్రం సుగుణను పార్టీలోకి ఆహ్వనించి కండువా కప్పింది. మా పార్టీ అభ్యర్థి అంటూ అఫిషియల్‎గా అనౌన్స్ చేయక పోయినా ఆత్రం సుగుణ వర్గం కాంగ్రెస్ అభ్యర్థి‌నంటూ ప్రచారం మొదలెట్టడంతో హస్తం పార్టీలోని బంజారా నేతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అటు బీజేపీ నుండి టికెట్ పక్కా అనుకున్న మాజీ ఎంపి రాథోడ్ రమేష్ , మాజీ బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు వర్గం తీవ్ర మనోవేదనకు గురవడం.. బీఆర్ఎస్ బంజారా సామాజిక వర్గం నేతలు‌సైతం తమకు అన్యాయం జరిగిందని భావించడం.. అధికార పార్టీ కాంగ్రెస్ బంజారా సామాజిక వర్గ కీలక నేతలు ఆలోచలనలో పడటంతో అంతా ఒక్కతాటిపైకి వచ్చి‌ మన సమాజాన్ని ఎందుకు రాజకీయంగా కాపాడుకోకూడదన్న చర్చ తెర మీదకి వచ్చింది. అనుకున్నదే తడవుగా రాజధాని వేదిక ఆదిలాబాద్ బంజారా నేతలంతా రహస్య సమావేశం పెట్టుకోవడం.. బలం బలగం‌ ఉన్న నేతను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి నిలపాలని ఫిక్స్ అవడం చకచకా జరిగిపోయినట్టు సమాచారం. దీంతో ఇంకా అభ్యర్థిని ప్రకటించని‌ అధికార పార్టీ కాంగ్రెస్ ఆలోచనలో పడినట్టు సమాచారం. బీజేపీ , బీఆర్ఎస్ లకు చెక్ పెట్టేలా లంబాడ సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునేలా బంజారా నేతకు జై కొట్టాలా.. లేక ఆదివాసీ వర్సెస్ బంజారా ఉద్యమానికి ఆద్యం పోసేలా రాజకీయ చక్రంలో ఇరుక్కోకుండా అందరి బాటలోనే ఆదివాసీ నేతకు జై కొట్టి అధికార బలంతో క్యాడర్ అండతో గెలవాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ సతమతమౌతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనుహ్యంగా తెర మీదకొచ్చిన ఆదివాసీ వర్సెస్ బంజారా పొలిటికల్ ఎజెండాతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దూసుకొచ్చే ఆ బంజారా నేత ఎవ్వరన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…