AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జలమో రామచంద్రా.. ఎండుతున్న ఎల్లంపల్లి, ఖాళీ అయిన కడెం

అసలే దెబ్బతీసిన ఖరీఫ్.. మరో వైపు మరమ్మత్తుల్లో కడెం ప్రాజెక్టు.. ఇంకో వైపు ఎండి ఎడారిగా మారుతున్న ఎల్లంపల్లి‌.. వెరసి గోదారి‌ తీర ప్రాంత రైతాంగం సాగునీరో రామచంద్రా అంటోంది. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఎండలకు ఎండి.. నీరంతా ఆవిరవుతుండటంతో గోదారి తీరమంతా రాళ్లు తేలి ఎడారిలా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు జలకళతో కళకళాలాడిన కడెం ప్రాజెక్ట్

Telangana: జలమో రామచంద్రా.. ఎండుతున్న ఎల్లంపల్లి, ఖాళీ అయిన కడెం
Kadem 1
Naresh Gollana
| Edited By: |

Updated on: Mar 27, 2024 | 9:49 PM

Share

అసలే దెబ్బతీసిన ఖరీఫ్.. మరో వైపు మరమ్మత్తుల్లో కడెం ప్రాజెక్టు.. ఇంకో వైపు ఎండి ఎడారిగా మారుతున్న ఎల్లంపల్లి‌.. వెరసి గోదారి‌ తీర ప్రాంత రైతాంగం సాగునీరో రామచంద్రా అంటోంది. ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఎండలకు ఎండి.. నీరంతా ఆవిరవుతుండటంతో గోదారి తీరమంతా రాళ్లు తేలి ఎడారిలా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు జలకళతో కళకళాలాడిన కడెం ప్రాజెక్ట్ మరమ్మత్తుల కోసం ఖాళీ కాగా.. దిగువకు నీళ్లొచ్చే దారి లేక నిర్మల్ జిల్లా కడెం మండలం నుండి మంచిర్యాల జిల్లా గూడెం వరకు గోదావరి తీరమంతా ఇదిగో‌ఇలా రాళ్లు తేలి కనిపిస్తోంది. ప్రస్తుతానికి గూడెం ఎత్తిపోతల ద్వారా మంచిర్యాల‌ జిల్లా దండెపల్లి , లక్షేట్టిపేట మండలాల రైతాంగానికి నీళ్లందతున్నా.. ఎల్లంపల్లి‌ బ్యాక్ వాటర్ గణనీయంగా పడిపోతుండటంతో చివరి పంట వరకు సాగు నీళ్లు అందడం గగనంగా మారుతోంది. సాగునీళ్లే కాదు తాగునీళ్లకు కరువు ఛాయలను మోసుకొస్తోంది ఎల్లంపల్లి.

ఇప్పటికే కడెం ప్రాజెక్ట్ సాగునీళ్లు ఇవ్వలేనంటూ చేతులెత్తేయడంతో దిగువ ప్రాంతం గోదావరిలో నీటి చుక్క కనిపించక.. నిర్మల్ – మంచిర్యాల‌ జిల్లాల గోదావరి తీర ప్రాంతాల్లో భూగర్బజలాలు సైతం అడుగంటి తాగునీటి తిప్పలను సైతం మోసుకొచ్చింది. ఈ ఎఫెక్ట్ తో మార్చి‌ మూడవ వారంలోనే మంచిర్యాల జిల్లా గోదావరి నది ఎండి ఎడారిగా మారి‌ కనిపిస్తోంది. మంచిర్యాల జగిత్యాల జిల్లాలను‌ విభజించే రాయపట్నం గోదావరి వద్ద రాళ్లు తేలి ఎడారిని తలపిస్తోంది. నాలుగేళ్లుగా 30 అడుగుల లోతు నీళ్లలో మునిగిన రెండవ వంతెన ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ భారీగా పడిపోవడంతో నీటిపై తేలి దర్శనమిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఏప్రిల్, మే లో మంచిర్యాల జిల్లా గోదారి తీర ప్రాంతంలో తాగునీటికి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది.

ఎల్లంపల్లి జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.70 టీఎంపీల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటి మట్టం 148 మీటర్లు కాగా ప్రస్తుతం 142.90 మీటర్లుగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఇన్ ఫ్లో జీరోకు పడిపోయింది. ఎండలు ముదురుతుండటంతో తాగునీటి అవసరాలు పెరుగుతుండటంతో ప్రస్తుతం 970 క్యూసెక్కుల నీటిని సాగు, తాగునీటి అవసరాలకు సరపరా చేస్తున్నారు అధికారులు. అయితే మరో వారం రోజుల్లో మరో 50 క్యూసెక్కుల నీటిని అదనంగా సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడటం.. నీటి నిల్వలు ఘననీయంగా పడిపోతుండటంతో ఎల్లంపల్లి జలాశయం నీటి కటకటను‌ ఎదుర్కొంటోంది. మరో వైపు సాగునీటి కోసం మంచిర్యాల జిల్లా గూడెం ఎత్తిపోతల ద్వారా కడెం జలాశయం ఆయకట్టుకు 290 క్యూసెక్కులు విడుదల చేయాల్సి వస్తుండటం.. తాగునీటి కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ పథకానికి 312 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండటంతో నీటినిల్వలు మరో ఆరు వారాలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది. మరో వైపు అటు పెద్దపల్లి ఇటు మంచిర్యాల జిల్లాల మిషన్ భగీరథ ఎల్లంపల్లి‌ మీదే ఆధారపడటంతో ఏకంగా 290 గ్రామాలకు నీటి‌కటకట ఏర్పడే ప్రమాదం ఉంది.

వేసవి కాలం ప్రారంభమవడం నీటి అవసరాలు పెరగడంతో గత నలభై రోజుల వ్యవధిలోనే ఎల్లంపల్లి జలాశయం నుండి 3 టీఎంసీల మేర నీటి వినియోగం జరిగింది. ఎండ తీవ్రత పెరిగేకొద్ది రోజుకు వంద క్యూసెక్కుల మేర నీరు ఆవిరవుతోందని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే మే వరకు జలాశయం డెడ్ స్టోరేజీకి వెళ్లే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే దీనికంతటికి కారణం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి ఎత్తిపోతలు ఆగిపోవడమే అని తెలుస్తోంది.