Medaram Jatara: మేడారం వెళ్లేవారికి ఆర్టీసీ శుభవార్త.. ప్రత్యేక బస్సులు ఇలా..
తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పేరుంది. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా ఈ జాతరను చూసేందుకు లక్షల మంది తరలివస్తుంటారు. దీంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది.

తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ది పొందిన మేడారం జాతరకు వెళ్లేవారి కోసం తెలంగాణ ఆర్టీసీ సర్వం సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో జాతరకు వెళ్లేవారికి గుడ్ న్యూస్ తెలిపింది. మేడారంకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపింది. రాష్ట్రాంలోని వివిధ డిపోల నుంచి మేడారంకు స్పెషల్ బస్సులను తిప్పనుంది. మేడారం జాతర జనవరి 25 నుంచి 31 వరకు జరగనుండగా.. ఆ రోజుల్లో ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటి వివరాల గరించి తెలుసుకుందాం.
ప్రత్యేక బస్సులు ఇలా..
ఖమ్మం రీజియన్ నుంచి మొత్తం 244 బస్సులను నడపనున్నారు. వీటిల్లో కొత్తగూడెం డిపో నుంచి 110 బస్సులు ఉండగా.. ఇల్లెందు నుంచి 41, భద్రాచలం నుంచి 21, పాల్వంచ నుంచి 15, సత్తుపల్లి ఏటూరునాగారం నుంచి 17, చర్ల నుంచి 3, వెంకటాపూర్ నుంచి 6, మణుగూరు నుంచి 16, మంగపేపట నుంచి 5, ఖమ్మం నుంచి 10 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
భూపాలపల్లి డిపో నుంచి
ఇక భూపాలపల్లి డిపో నుంచి ప్రత్యేక బస్సులను మేడారంకు ప్రకటించారు. ఘనపూర్, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, పస్రా,చల్పూర్ మీదుగా ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు ఈ బస్సులు తిరగనన్నాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో మహలక్ష్మి పథకం వర్తించనుంది. దీంతో మహిళలు ఉచితంగా వీటిల్లో ప్రయాణించవచ్చు. మేడారం వెళ్లే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
