AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : పోరాడి ఓడిన నెదర్లాండ్స్.. సూపర్ సిక్స్‎లోకి టీమిండియా సక్సెస్‎ఫుల్ ఎంట్రీ

IND vs NED: టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్-ఏ ఆఖరి పోరులో టీమిండియా విజయఢంకా మోగించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. శివం దూబే సిక్సర్ల సునామీకి తోడు బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన తోడవ్వడంతో, పసికూన నెదర్లాండ్స్ భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యం ముందు మోకరిల్లింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచి, పూర్తి ఆత్మవిశ్వాసంతో సూపర్‌-8 రౌండ్‌లోకి అడుగుపెట్టింది.

T20 World Cup 2026 : పోరాడి ఓడిన నెదర్లాండ్స్.. సూపర్ సిక్స్‎లోకి టీమిండియా సక్సెస్‎ఫుల్ ఎంట్రీ
India Vs Netherlands Result
Rakesh
|

Updated on: Feb 18, 2026 | 10:41 PM

Share

టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్ ఏ ఆఖరి పోరులో నెదర్లాండ్స్‌ను 17 పరుగుల తేడాతో ఓడించి భారత్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే సూపర్‌ 8 బెర్తును ఖరారు చేసుకున్న భారత్, లీగ్ దశను అజేయంగా ముగించి ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది. శివం దూబే మెరుపు హాఫ్ సెంచరీకి తోడు బౌలర్ల క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన తోడవ్వడంతో నెదర్లాండ్ జట్టు పోరాటం ఓటమితో ముగిసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ శివం దూబే శివాలెత్తాడు. కేవలం 31 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 66 పరుగులు చేసి ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (34), తిలక్ వర్మ (31), హార్దిక్ పాండ్యా (30) మెరుపులు మెరిపించారు. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం మరోసారి సున్నాకే వెనుదిరిగి డకౌట్ల హ్యాట్రిక్ నమోదు చేయడం అభిమానులను కలవరపెడుతోంది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగుల వద్దే నిలిచిపోయింది. బాస్ డి లీడే (33) టాప్ స్కోరర్‌గా నిలవగా, భారత బౌలర్ల ధాటికి డచ్ బ్యాటర్లు లక్ష్యానికి చేరువగా వచ్చినా విజయాన్ని అందుకోలేకపోయారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన మాయాజాలంతో హ్యాట్రిక్ వికెట్ల చాన్స్ వరకు వెళ్లాడు. బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ ఆఖరి ఓవర్లో భారత ఫీల్డర్లు రెండు క్యాచ్‌లు వదిలేసినా, భారీ స్కోరు ఉండటంతో టీమిండియాకు ముప్పు తప్పింది.

గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్, ఇప్పుడు సూపర్‌ 8 రౌండ్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాతో తలపడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే భారత్ ఈసారి కప్పు కొట్టేలాగే కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం టీమ్ మేనేజ్‌మెంట్‌కు కొండంత బలాన్నిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us