పెళ్లి పీటలు ఎక్కనున్న లేడీ కోహ్లీ.. ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసేందుకు రెడీ..
Smriti Mandhana Weds Palash Muchhal: భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన త్వరలో ఆమె తన ప్రియుడు, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోనుంది. వచ్చే నెలలో వివాహం జరగవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

Smriti Mandhana Weds Palash Muchhal: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఆమె తన ప్రియుడు, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్ఛల్ (Palash Muchhal) ను వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా వారి పెళ్లి వేడుకలు స్మృతి మంధాన సొంత ప్రాంతం సాంగ్లీ (Sangli) లో మొదలుకానున్నాయంట. నవంబర్ 20న వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని టైమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నివేదించింది. 2019లో డేటింగ్ ప్రారంభించిన స్మృతి, పలాష్, జులై 2024లో వీరి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భావోద్వేగ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా వారి సంబంధాన్ని బహిరంగపరిచారు.
సాంగ్లీలో సంబరాలు ప్రారంభం..!
మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతం స్మృతి మంధాన సొంత ఊరు. అందుకే ఆమె వివాహ వేడుకలను ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. నవంబర్ 20న వేడుకలు మొదలుకానున్నాయంట. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొనే విధంగా ఈ వివాహ వేడుక జరగనుంది.
ఇండోర్ కోడలిగా స్మృతి మంధాన..
స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సుమారు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ తరచుగా కలిసి దిగిన ఫొటోలు పంచుకుంటూ అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఇటీవల పలాష్ ముచ్ఛల్ స్వయంగా వీరి పెళ్లిని ధృవీకరించారు. ఇండోర్ నుంచి వచ్చిన పలాష్ ముచ్ఛల్… “స్మృతి త్వరలో ఇండోర్‌కు కోడలు కాబోతోంది” అంటూ నవ్వుతూ ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు, క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మ్యూజిక్, క్రికెట్ కలయిక..
క్రికెట్‌లో తన కవర్ డ్రైవ్‌లు, మెరుపు బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి మంధాన.. ఇకపై సంగీత ప్రపంచంతో బంధుత్వం కలుపుకోబోతున్నారు. పలాష్ ముచ్ఛల్ బాలీవుడ్‌లో మంచి పేరున్న సంగీత దర్శకుడు. ఆయన సోదరి పాలక్ ముచ్ఛల్ (Palak Muchhal) కూడా ప్రముఖ గాయని అన్న విషయం తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








