Telangana Bonalu: భక్తులకు శుభవార్త.. గుడికి వెళ్లకుండా బోనం సమర్పించొచ్చు.. అదెలాగంటే..
Telangana Bonalu: తెలంగాణలో బోనాల పండగ అంటే.. సంబరం మాత్రమే కాదు.. అంతకు మించి. బోనాల పండుగ వేళ ఉండే సందడి అంతా ఇంతా కాదు.
Telangana Bonalu: తెలంగాణలో బోనాల పండగ అంటే.. సంబరం మాత్రమే కాదు.. అంతకు మించి. బోనాల పండుగ వేళ ఉండే సందడి అంతా ఇంతా కాదు. అయితే, చాలా మంది భక్తులు పరిస్థితుల కారణంగా అమ్మవారికి బోనాలు సమర్పించలేకపోతుంటారు. ఇలాంటి సమస్యలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్ సరికొత్త ఉపాయం చేసింది. అదేంటంటే.. ఇక నుంచి బోనమెత్తకుండానే బోనం చెల్లించొచ్చు. అవును, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పనిలేకుండానే మొక్కులు చెల్లించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆషాడ మాషం మొదలైందంటే చాలు.. తెలంగాణలో ఉండే సందడి. ఆ సంబరమే వేరు. పల్లె పల్లె, వాడ, వాడలో ప్రతి ఇంటి ఆడబిడ్డ.. నెత్తిన బోనమెత్తి.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. బతుకమ్మ ఆడి మురిసిపోతారు. ఇంట్లో ఎత్తుకున్న బోనం.. అమ్మవారి దగ్గరకు చేరుకునే వరకు కిందికి దించకుండా బోనం ఎత్తుకెళ్తారు. కానీ ఇక నుంచి అలాంటి అవసరం లేదు.. అసలు బోనం నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. ఆన్‌లైన్‌లోనే మొక్కులు చెల్లించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది దేవాదాయ శాఖ.
ఉజ్జయినీ మహంకాళీ, బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవారికి బోనం చెల్లించాలనుకునే వాళ్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారు. గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత పోస్టు ద్వారా బోనంలోని బియ్యం ప్రసాదంలా పంపిణీ చేస్తారు. వాటిని ఇంటి వద్దే వండుకొని ప్రసాదంలా స్వీకరించవచ్చు. బియ్యంతో పాటు బెల్లం, అక్షింతలు, పసుపు కుంకుమ కూడా ఇంటికి పంపిస్తారు.
జూలై 4 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. టీయాప్ ఫోలియో, మీ సేవ, ఆలయ వెబ్‌సైట్, పోస్ట్ ఆఫీస్ ద్వారా దేశ, విదేశీ భక్తులు ఈ సేవలను బుక్ చేసుకోవచ్చు. దేశీయ భక్తులకు అయితే.. 300 రూపాయలు, విదేశాల్లో ఉండే భక్తులకు అయితే 1000 రూపాయల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ దేవాదాయ శాఖ.