Suicide: ఆత్మహత్యలకు డిప్రెషన్ మాత్రమే కారణం కాదా? వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
ఆత్మహత్య అనగానే సాధారణంగా అందరూ అది మానసిక ఒత్తిడి లేదా డిప్రెషన్ వల్ల జరిగిందని భావిస్తారు. లేదంటే సమాజం, కుటుంబ పరిస్థితులు అనేక కారణాలు ఉన్నాయని అనుకుంటారు. అయితే, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనల వెనుక ఉన్న షాకింగ్ నిజాన్ని తాజా పరిశోధనలు బయటపెట్టాయి.

సాధారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే, వారు తీవ్రమైన మనస్తాపంలో ఉన్నారని లేదా డిప్రెషన్‌తో బాధపడుతున్నారని మనం అందరూ అనుకుంటాం. “అంత కష్టం ఏం వచ్చిందో” పాపం అని బాధపడతాం. కానీ, యూనివర్సిటీ ఆఫ్ ఉతా హెల్త్ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనం ప్రకారం.. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కేవలం మానసిక జబ్బుల వల్లే రాదని, దీనికి జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చని తేలింది.
డిప్రెషన్ లేకపోయినా ముప్పేనా?
చాలా సందర్భాల్లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తులకు ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నట్లు రికార్డుల్లో ఉండదు. వారు అంతకుముందు ఎప్పుడూ డిప్రెషన్‌కు గురైనట్లు లేదా చికిత్స తీసుకున్నట్లు ఆధారాలు కనిపించవు. ఇలాంటి వారిపై పరిశోధకులు దృష్టిసారించారు. సుమారు 2,700 మందికి పైగా మరణించిన వ్యక్తుల జన్యువులను విశ్లేషించగా, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి.
వేర్వేరు జన్యు కారకాలు:
మానసిక సమస్యలు ఉన్నవారిలో కనిపించే జన్యువుల కంటే, ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా ఆత్మహత్య చేసుకున్న వారిలో జన్యువులు భిన్నంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. అంటే, ఆత్మహత్య చేసుకునే ప్రమాదం అనేది డిప్రెషన్, యాంగ్జైటీ లేదా పీటీఎస్‌డీ వంటి సమస్యలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా కూడా పని చేయవచ్చు.
ఎందుకు ఈ పరిశోధన ముఖ్యం?
ఇప్పటివరకు ఆత్మహత్యలను నివారించడానికి కేవలం డిప్రెషన్ తగ్గించే మందులు లేదా కౌన్సెలింగ్‌పైనే వైద్యులు ఆధారపడుతున్నారు. అయితే, కొంతమందిలో జన్యుపరంగానే ఈ రిస్క్ ఉన్నప్పుడు, దాన్ని గుర్తించడానికి వేరే మార్గాలు వెతకాల్సి ఉంటుందని ఈ స్టడీ చెబుతోంది. ఈ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్లను ముందుగానే గుర్తిస్తే, భవిష్యత్తులో ప్రాణాలు కాపాడేందుకు కొత్త రకమైన చికిత్సలు మరియు పరీక్షలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆత్మహత్య అనేది కేవలం ఒక వ్యక్తి బలహీనత కాదు. దాని వెనుక అంతుచిక్కని సైన్స్ దాగి ఉంది. ఈ కొత్త ఆవిష్కరణలు మానసిక ఆరోగ్య రంగంలో సరికొత్త మార్పులకు దారితీయవచ్చు.
