భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం! ఈ తప్పులు చేయొద్దు
హిందూ ధర్మంలో వివాహమైన తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో స్త్రీల పాత్ర పెరుగుతుంది. మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత భర్తతోపాటు ఆ కుటుంబ మంచి చెడు తనవిగా భావిస్తుంది. అందుకే పూజలు, ఉపవాసాలు చేస్తూ తన భర్త క్షేమాన్ని కోరుకుంటారు. భార్య చేసే ప్రత్యేక పూజలు, వ్రతాలు భర్త శ్రేయస్సుతోపాటు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి. ఆ ఇంట్లో సానుకూల మార్పులకు కారణమవుతాయి.

సనాతన ధర్మంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహానికి ముందు, తర్వాత స్త్రీలు, పురుషులు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. వివాహమైన వారికే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాల్లో స్త్రీల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. వివాహం తర్వాత స్త్రీని భర్తలో సగభాగంగా పరిగణిస్తారు. ఇక, భర్త చేసే మంచి పనుల ద్వారా వచ్చే పుణ్యంలో సగం భార్యకు చెందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
అయితే, వివాహం తర్వాత స్త్రీకి భర్తతోపాటు ఒక కొత్త కుటుంబం ఏర్పడుతుంది. భర్త క్షేమంతోపాటు వివిధ బాధ్యతలు ఆమెపై ఉంటాయి. వివాహమైన స్త్రీ చేసే ఏ పని అయినా భర్తతోపాటు ఆ కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే వివాహమైన తర్వాత పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చే ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు చెబుతుంటారు. ఇక, ఆధ్యాత్మికంగా వివాహమైన స్త్రీలు తన భర్త శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తుంటారు. కొందరు ఉపవాసాలు చేస్తుంటారు. భార్య చేసే కొన్ని పనులు భర్తకు క్షేమంతోపాటు ఐశ్యాన్ని తీసుకువస్తాయి. అవేంటో చూద్దాం.
ఉదయం ఏం చేయాలి?
వివాహిత స్త్రీలు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత పూజా గదిని శుభ్రం చేసి, రాగి పాత్రలో నీటిని తీసుకుని ఇల్లంతా చల్లాలి. ఇలా చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి వస్తుంది. చిన్నపాటి ఆందోళనలను కూడా దూరం చేస్తుంది. వివాహిత స్త్రీలు స్నానం చేయకుండా పూజ గదికి, వంటగదికి వెళ్లకూడదని శాస్త్రం చెబుతోంది.
తులసి పూజ
తులసి పూజకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహిత స్త్రీలు తులసిని పూజించడం వల్ల భర్తతోపాటు కుటుంబానికి మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసి, తులసి పూజ చేసి, నీటిని సమర్పించాలి. తులసి ఇంట్లో పాజిటివిటీని పెంచే ప్రధానమైన మొక్క అని చెప్పవచ్చు. లక్ష్మీదేవి రూపమైన తులసిని ఉదయాన్నే పూజించడం వల్ల ఆ స్త్రీతోపాటు కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది.
ఉపవాసాలు, వ్రతాలు
వివాహిత స్త్రీలు ఏకాదశి, పౌర్ణమి లాంటి పవిత్ర రోజుల్లో ఉపవాసాలను పాటించాలి. ఈ రోజుల్లో భక్తిశ్రద్ధలతో ఆయా దేవీదేవతలను ప్రత్యేకంగా పూజించాలి. దీంతో వారి వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి.
సంధ్యా సమయంలో ఏం చేయాలి?
వివాహమైన స్త్రీలు సంధ్యా సమయంలో స్నానం చేయాలి. లేదంటే ముఖం, చేతులు, కాళ్లు కడుక్కోవాలి. ఆ తర్వాత తులసి మొక్క ముందు, పూజ గదిలో, ఇంటి ప్రధాన ద్వారా దగ్గర దీపం వెలిగించాలి. ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ప్రతిరోజూ స్త్రీలు ఈ పనులు చేయడం వల్ల భార్య తన భర్తకు ఐశ్వర్యం, కుటుంబానికి ఆనందాన్ని కలగజేస్తుంది. వీరి నివాసాల్లో ధన, ధాన్య, ఆరోగ్య సమస్యలు తలెత్తవు.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9 దీనిని ధృవీకరించదు.
