AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gongura Rice Recipe: నోరూరించే గోంగూర రైస్.. ఒక్కసారి తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!

ఆంధ్రులకు గోంగూర అంటే ఒక ఎమోషన్. ఆ గోంగూరతో రైస్ చేస్తే ఆ మజానే వేరు. అయితే దీన్ని చేసే కొన్ని రెసిపీలకు సాధారణ వంటకాల కన్నా ఎక్కువ టైమ్ పడుతుందని అనుకుంటారు. కానీ సింపుల్ పద్ధతిలో కూడా ఈ గోంగూరను వండుకుని ఆ రుచిని ఆస్వాదించొచ్చు. అలాంటి ఒక రెసిపీనే ఈ గొంగూర రైస్. ఈ రెసిపీని పులిహోర స్టైల్‌లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

Gongura Rice Recipe:  నోరూరించే గోంగూర రైస్.. ఒక్కసారి తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు!
Andhra Style Gongura Rice Recipe
Bhavani
|

Updated on: Feb 19, 2026 | 9:51 PM

Share

గోంగూర పచ్చడి గురించి అందరికీ తెలిసిందే. కానీ అదే గోంగూరతో చేసే రైస్ ఒక అద్భుతం. ముఖ్యంగా లంచ్ బాక్సుల్లోకి, ప్రయాణాల్లోకి ఎంతో రుచిగా ఉండే ఈ గోంగూర రైస్ తక్కువ సమయంలో చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు :

ఉడికించిన అన్నం – 2 కప్పులు (పొడిపొడిగా ఉండాలి)

గోంగూర ఆకులు – 2 కట్టలు

నూనె – 3 టేబుల్ స్పూన్లు

వేరుశెనగ పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు

ఎండుమిర్చి – 4 లేదా 5

పచ్చిమిర్చి – 3 (చీలికలు)

తాలింపు గింజలు (ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు) – 1 టేబుల్ స్పూన్

కరివేపాకు – 2 రెమ్మలు

ఇంగువ – చిటికెడు

పసుపు – అర టీస్పూన్

ఉప్పు – రుచికి సరిపడా

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్ (ఆప్షనల్)

నెయ్యి – 1 టీస్పూన్

తయారీ విధానం:

ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి గోంగూర ఆకులను వేయాలి. ఆకులు మెత్తబడి దగ్గరగా అయ్యేవరకు మగ్గించాలి. చల్లారిన తర్వాత దీనిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.

ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి పాత్రలో వేసి, అందులో కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. అన్నం పొడిపొడిగా ఉంటేనే రుచి బాగుంటుంది.

మరో బాణలిలో నూనె వేసి వేడయ్యాక.. పల్లీలను దోరగా వేయించి పక్కన తీయాలి. అదే నూనెలో తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. కావాలనుకుంటే ఇక్కడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేగనివ్వాలి.

తాలింపు సిద్ధమయ్యాక, మనం రెడీ చేసుకున్న గోంగూర పేస్ట్‌ను వేసి నూనె పైకి తేలే వరకు రెండు నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. చివరగా వేయించిన పల్లీలు, కొద్దిగా నెయ్యి వేస్తే గోంగూర రైస్ రెడీ!

Follow Us