డ్రైవర్ నిర్లక్ష్యం.. కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్ బస్సు! 40 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద 60 మంది విద్యార్ధులతో స్కూల్ నుంచి ఇళ్లకు వెళ్తుండగా స్కూల్ బస్సు అదుపుతప్పి కాల్వలో బోల్తా పడింది. వేంసూరు మండలం మొద్దులగూడెంలోని వివేకానందా విద్యాలయం నుంచి సుమారు వంద మంది విద్యార్థులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది..

ఖమ్మం, జనవరి 3: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్‌పాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 100 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. మద్దులగూడెం (వేంసూరు మండలం)లోని వివేకానంద విద్యాలయం నుంచి విద్యార్ధులతో బయల్దేరిన స్కూల్ బస్సు.. శుక్రవారం సాయంత్రం గణేష్‌పాడు, ఎల్‌ఎస్ బంజర్, కెఎం బంజర్, మర్లకుంట, ముత్తుగూడెంలకు చెందిన విద్యార్థులను వారి ఇళ్లకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానిక ప్రత్యక్ష సాక్షుల ప్రకారం
గణేశ్‌పాడు గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ బస్సును వేగంగా నడపడంతో అదుపుతప్పి కాల్వలోకి పల్టీ కొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ అతి వేగంగా వాహనం నడపడం వల్లే బస్సు నియంత్రణ కోల్పోయిందని, ఫలితంగా బస్సు కాలువలోకి బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
సమాచారం అందుకున్న VM బంజార్ పోలీసులు, విద్యార్థుల తల్లిదండ్రులు.. హుటాహుటీన సంఘటనా స్థలాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను వెంటనే చికిత్స కోసం పెనుబల్లి, తిరువూరు (NTR జిల్లా, ఆంధ్రప్రదేశ్) లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారణ జరిపి సబ్ కలెక్టర్, ఏసీపీతో మాట్లాడారు. గాయపడిన విద్యార్థులకు సరైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




