TG TET 2026 Exams: నేటి నుంచే టెట్ ఆన్‌లైన్ రాత పరీక్షలు.. చివరి నిమిషంలో ఈ తప్పులు వద్దు!
రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2026) పరీక్షలు మరికాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 97 పరీక్ష కేంద్రాల్లో ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి..

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2026) ఆన్‌లైన్ పరీక్షలు శనివారం (జనవరి 3) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 20 వరకు మొత్తం 9 రోజులపాటు ఆన్‌లైన్ విధానంలో వివిధ సబ్జెక్టులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. రెండు పేపర్లకు టెట్ పరీక్షలు జరుగుతాయి.
పేపర్ 1, పేపర్ 2కి కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,37,754 మంది అభ్యర్ధులు ఈసారి టెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 71,670 మంది ఇన్ సర్విస్ టీచర్లు అంటే ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో ఉన్న టీచర్లు కూడా ఉన్నారు. టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా భారీగానే టెట్‌కు దరఖాస్తు చేసకున్నారు. వీరందరికీ ఈ రోజు నుంచి రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరుగుతుంది. అంటే ప్రతీ సెషన్ పరీక్షలు 2 గంటల 30 నిమిషాలపాటు జరుగుతాయన్నమాట.
టెట్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 97 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇక అభ్యర్ధులను పరీక్షకు గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్ధులు తమతోపాటు అడ్మిట్ కార్డుతోపాటు ఏదైనా గుర్తింపు పొందిన ఐడీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి తమతోపాటు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్స్‌కు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. డీఎస్సీ పరీక్షలు రాయాలంటే టెట్ స్కోర్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. టెట్ లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. పరీక్షకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 7093708883 / 7093708884, 7093958881 / 7093468882,7032901383 / 9000756178 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చని విద్యాశాఖ డైరెక్టర్ డా ఇ నవీన్ నికోలస్ తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




