Jaggery: నల్ల బెల్లం, తెల్ల బెల్లం.. వీటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్? కొనేముందు ఇది చూడండి!
బెల్లం అనగానే మనందరికీ గుర్తొచ్చేది తీపి. పంచదార కంటే బెల్లం ఆరోగ్యం అని అందరికీ తెలుసు. కానీ మార్కెట్లో దొరికే రకరకాల బెల్లాల్లో ఏది అసలైనదో, ఏది ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందో చాలామందికి తెలియదు. ఏదైనా ఒకటే కదా అని అనుకుంటాం. కానీ మార్కెట్‌లో చాలా రకాల బెల్లాలు ఉంటాయని కూడా మనలో చాలా మందికి తెలియని విషయం

మన వంటకాల్లో, ముఖ్యంగా పండుగ ప్రసాదాల్లో బెల్లానికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వం నుంచి మన పెద్దలు పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా వాడేవారు. అయితే, నేటి కాలంలో మార్కెట్లో రంగురంగుల బెల్లాలు కనిపిస్తున్నాయి. అసలు ఏ రకమైన బెల్లం వాడితే మన శరీరానికి పోషకాలు అందుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
తాటి బెల్లం (Palm Jaggery):
అన్ని రకాల బెల్లాల్లో తాటి బెల్లం మంచిదని చెబుతారు. ఇది తాటి చెట్టు నుంచి తీసిన నీరా ద్వారా తయారవుతుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా బాడీ డిటాక్స్ అవుతుంది.
చెరకు బెల్లం (Sugarcane Jaggery):
మనం నిత్యం వాడేది చెరకు బెల్లం. ఇది శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇందులో మనం గమనించాల్సింది రంగు. మార్కెట్లో తెల్లగా లేదా పసుపు రంగులో మెరిసిపోయే బెల్లం కనిపిస్తే అది కెమికల్స్ కలిసిన బెల్లం అని గుర్తుంచుకోవాలి. సహజమైన పద్ధతిలో తయారైన బెల్లం ముదురు గోధుమ రంగులో లేదా నలుపు రంగులో ఉంటుంది. రంగు తక్కువగా ఉన్న బెల్లమే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కొబ్బరి బెల్లం (Coconut Jaggery):
కొబ్బరి పువ్వుల నుంచి తీసిన రసంతో ఈ బెల్లం తయారు చేస్తారు. ఇది దక్షిణ భారతదేశంలో కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది.
ఏది మంచిది?
ఆరోగ్య పరంగా చూస్తే తాటి బెల్లం (Palm Jaggery) మొదటి స్థానంలో ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. ఇక సాధారణ చెరకు బెల్లం కొనేటప్పుడు అది ముదురు రంగులో, గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తెల్లటి బెల్లం తయారీలో సోడియం కార్బోనేట్ వంటి రసాయనాలు వాడతారు. ఇవి ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, మీరు ఇకపై బెల్లం కొనేటప్పుడు కేవలం రుచిని మాత్రమే కాకుండా, అది ఏ రకమో మరియు దాని రంగును బట్టి సరైనది ఎంచుకోండి. తీపి తింటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
