Blood Sanders: శేషాచలం To చైనా.. ఎర్రచందన అక్రమ రవాణా కథా చిత్రాన్ని కళ్లకు కడుతోన్న ‘బ్లడ్‌ సాండర్స్‌’..

Blood Sanders: ఎర్ర చందనం అక్రమ రవాణా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ అంశంపై ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా కథ మొత్తం ఈ ఎర్రచందనం అక్రమ..

Blood Sanders: శేషాచలం To చైనా.. ఎర్రచందన అక్రమ రవాణా కథా చిత్రాన్ని కళ్లకు కడుతోన్న ‘బ్లడ్‌ సాండర్స్‌'..
Follow us

|

Updated on: Jan 08, 2022 | 6:19 PM

Blood Sanders: ఎర్ర చందనం అక్రమ రవాణా.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ అంశం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా కథ మొత్తం ఈ ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా దేశంలోని పలు భాషల్లో విడుదలకావడంతో, ఎర్రచందనం అక్రమ రవాణాపై అందరి దృష్టి పడింది. అయితే అంతకు ముందే ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకొని ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డి ఉడుముల ‘బ్లడ్‌ సాండర్స్‌ – ది గ్రేట్‌ ఫారెస్ట్‌ హీస్ట్‌’ పేరుతో డిసెంబర్ 14న ఓ పుస్తకాన్ని విడుదల చేశారు.

దాదాపు 30 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో ఈ ప్రకృతి సంపదను నేరస్థులు కొల్లగొడుతూనే ఉన్నారు. ఎక్కడో ఏపీలోని చిత్తూరు నుంచి చైనా, జపాన్‌ వంటి దేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతోన్న ఈ ఎర్ర బంగారం అక్రమ రవాణా వెనక ఎంతో మంది రాజకీయనాయకులు, నేరస్థుల, బ్యూరోక్రాట్‌ల హస్తం ఉండడం జగమెరిగిన సత్యం. కొందరు నిజాయితీ కలిగిన ప్రభుత్వ, పోలీసు అధికారులు దీనికి అడ్డుకట్ట వేయడానికి శతవిధాల ప్రయత్నించినా.. తగ్గేదేలే అన్నట్లు ఎర్ర బంగారం అక్రమార్కులు చెలరేగి పోతూనే ఉన్నారు.

శేషాచలం To చైనాగా సాగుతోన్న ఈ అక్రమ దందా వెనక ఒక పెద్ద నెట్‌వర్క్‌ ఉందని చాలా మందికి తెలియదు. ఈ అంశాలను పరిశోధనాత్మక వివరాలతో సుధాకర్‌ రెడ్డి ఉడుముల ఈ పుస్తకాన్ని రచించారు. మీడియాలో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం తగ్గిపోంతోందంటూ ఇటీవల వ్యాఖ్యానించిన.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. ‘ఈ రోజు మన చేతుల్లో ఉన్న ‘బ్లడ్‌ సాండర్స్‌’ పుస్తకం శ్రీ ఉడుముల సుధాకర్‌ రెడ్డి గారి అహర్నిశలు చేసిన కృషికి ఫలితం. అతడు దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రొఫెషనల్‌ న్యూస్‌ రిపోర్టర్‌గా ఈ విషయాన్ని ట్రాక్‌ చేస్తున్నాడు. నడవడానికే కష్టతరమైన భూభాగం ఎర్రచందనం ఆవాసాలలో అతడు విస్తృతంగా పర్యటించాడు. స్మగ్లింగ్‌ రాకెట్‌లో కీలకమైన వారితో, చట్టాన్ని అమలు చేయడానికి పోరాడుతున్న వారితో అతడు ప్రత్యక్షంగా మాట్లాడి ఎర్ర చందనం అక్రమ రవాణాకు ఒక అక్షరం రూపం తెచ్చాడు’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంతకీ ఈ పుస్తకంలో ఏముందంటే..

అడవిలో ఎర్రచందనం చెట్లను నరికే కూలీల నుంచి, సముద్ర ఒడ్డు వరకు సరఫరా చేసే డ్రైవర్ల వరకు, అక్కడి నుంచి విదేశాలకు తరలించే వారి వరకు దీనంతటినీ శాసించే రాజకీయ నాయకులు, మాఫీయా లీడర్లు.. ఇలా ఓ పెద్ద నేర సామ్రాజ్యానికి సుధాకర్‌ రెడ్డి అక్షర రూపం ఇచ్చారు. పుస్తకంలో ప్రతీ అంశాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ఆద్యంతం ఒక క్రైమ్‌ చిత్రాన్ని తలపిస్తోన్న ఈ పుస్తకం పాఠకులకు థ్రిల్లింగ్‌ అనుభూతిని కలిగిస్తోంది. ఈ పుస్తకంలో శేషాచలం దట్టమైన అడవుల నుండి ఎర్రచందనం అక్రమ రవాణా మొదలుకుని అది చైనా, జపాన్‌లో విలాసవంతమైన ఇళ్లకు చేరుకునే వరకు క్రూరమైన నేర నెట్‌వర్క్‌ కార్యకలాపాలను బహిర్గతం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌పై రిపోర్టింగ్‌లో తనకున్న అపారమైన అనుభవాన్ని పుస్తకంలో ప్రస్తావించారు రచయిత. సరిహద్దుల గుండా ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపించే సంక్లిష్ట నెట్‌వర్క్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం తొలి అడుగుగా చెప్పవచ్చు.

మొత్తం పది చాప్టర్లతో కూడిన ఈ పుస్తకంలో ప్రతీ చాప్టర్‌ ఎర్ర చందనం స్మగ్లింగ్‌ అనే వ్యవస్థీకృత క్రైమ్‌ సిండికేట్‌లోని విభిన్న కోణాలను పరిచయం చేస్తుంది. మొదటి చాప్టర్‌లో ఎర్రచందనానికి అంత విలువ ఎలా వచ్చిందో రచయిత ప్రస్తావించారు. తర్వాతి మూడు చాప్టర్లలో ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎలా ప్రారంభమైందన్న విషయాలతో పాటు.. గ్రౌండ్‌ లెవల్‌లో స్మగ్లింగ్ ప్రక్రియ ఎలా సాగుతుంది లాంటి అంశాలను పూసగుచ్చినట్లు వివరించారు. ఇక 5వ చాప్టర్‌ ఈ అంతర్జాతీయ స్మగ్లింగ్‌ రవాణా ఎలా సాగుతుందో కళ్లకు కడుతుంది. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ విషయాలను తెలిపారు.

ఇందులో భాగంగానే 2015 ఏప్రిల్‌లో చిత్తూరులో జరిగిన ఎన్‌కౌంటర్‌ విశేషాలను కూడా రచయిత ప్రస్తావించారు. తర్వాతి చాప్టర్‌లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌లో రాజకీయ నాయకులు, స్మగ్లర్ల మధ్య ఉన్న చీకటి సంబంధాలను తెలిపే ప్రయత్నం చేశారు. ఈ అంశాలను అన్నింటినీ ప్రస్తావిస్తూనే రచయిత ఎర్రచందనం నరికివేతను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను చివరి చాప్టర్‌లో ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేశారు. ఇలా పుస్తకం మొత్తం ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో ఒక థ్రిల్లర్‌ సినిమాను తలపించేలా ప్రతీ పేజీని చదివిస్తోంది. ప్రస్తుతం పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటోన్న ‘బ్లడ్‌ సాండర్స్‌’ అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్స్‌తో పాటు అన్ని ప్రముఖ బుక్‌ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Also Read: Viral Video: ఖతర్నాక్ దొంగ.. రబ్బర్ బ్యాండ్‌తో కార్లలో చోరీ… ఎలానో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్

Telangana: ఆ గ్రామంలో కలకలం… సమాధి తవ్వి మహిళ పుర్రె ఎత్తుకెళ్లారు..

Rashmika Mandanna: రష్మిక పేరు మారిపోయింది.. మందన్న కాస్త మడోనాగా.. ఎందుకంటే..