Third Front: టార్గెట్ బీజేపీ.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యం దిశగా సీఎం కేసీఆర్ అడుగులు
లక్ష్యం మూడో కూటమి..టార్గెట్ బీజేపీ. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అడుగులు అటు వైపే పడుతున్నట్లు కనిపిస్తోంది.
లక్ష్యం మూడో కూటమి..టార్గెట్ బీజేపీ.. తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(Telangana CM KCR) అడుగులు అటు వైపే పడుతున్నట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు దిశగా ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌యేతర సీఎంలను, పలు పార్టీల అధినేతలను కలుస్తూ దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీస్తున్నారు. కేంద్రంలోని అధికార బీజేపీ విధానాలను ఇటీవల ఓ రేంజ్‌లో టీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు కేంద్రం తీరును తప్పుడుతూనే మరోవైపు బీజేపీ, కాంగ్రెస్సేతర సీఎంలను ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడం ఆసక్తిగా మారింది. ఇటీవల చెన్నై వెళ్లి మరీ తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్‌ను లంచ్‌కు పిలిచి మరీ చర్చలు జరిపారు. బీజేపీ తీరుపై కేరళ సీఎంతోపాటు సీపీఎం ఢిల్లీ నేతలతోనూ చర్చించారు కేసీఆర్. కేంద్రం నిర్ణయాలు, రైతుల ఆందోళన, వ్యవసాయ చట్టాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఇదే కాదు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్. ఇటీవలే ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. ఆ సాయాన్ని అందించేందుకు ఇతర రాష్ట్రాలు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలతోపాటు దేశంలో కీలక సమస్యలపై కేంద్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న అంశాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందన్నది సీఎం కేసీఆర్ వాదన. కేంద్రం తన బాధ్యతలను, చేయాల్సిన ఇతర పనులను కూడా సరిగ్గా చేయడం లేదని చాలాసార్లు ఆరోపించారు.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలోనూ వివక్ష చూపుతూ, కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నది టీఆర్‌ఎస్ ప్రధాన విమర్శ. ఈ అంశంలోనే రెండు సార్లు ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ వెళ్లి మరీ కేంద్రంలో పెద్దలను కలిశారు. నలుగురు మంత్రుల బృందాన్ని వారం రోజులు ఢిల్లీలోనే ఉంచినా ప్రయోజనం లేదన్న ఆగ్రహంతో గులాబీ బాస్ ఉన్నారు. ఇతర రాష్ట్రాల పట్లా ఇదే వైఖరితో కేంద్రం ఉందని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఈ పరిస్థితుల్లో కేంద్రం తీరుకు నిరసనగా జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల సీఎంలతో భేటీ కావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌యేతర పార్టీల అధినేతలతోనూ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో దీనిపై రియాక్ట్ అయ్యారు కేసీఆర్. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసం ఇతర పార్టీలను కలుపుకుని వెళ్తామని ప్రకటించారు.
ఈ నెలలోనే ఒకటి, రెండు రాష్ట్రాలకు, మార్చిలోపు 5 నుండి 8 రాష్ట్రాలకు వెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంట్‌కు ఆలోచనలు చేస్తున్న క్రమంలో కేసీఆర్ పర్యటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించినప్పటికీ పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు. ఇప్పుడు కేసీఆర్ సరికొత్త వ్యూహాలకు బీజేపీపై వస్తున్న వ్యతిరేకత కూడా తోడవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సీపీఎం నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం..
బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి త్వరలో నిరసనలకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీపీఎంకు చెందిన పినరయి విజయన్ వెంట ఇద్దరు మంత్రివర్గ సహచరులతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, పొలిట్ బ్యూర్ సభ్యుడు ప్రకాశ్ కారత్ కూడా ఉన్నారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ జరగింది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి పనిచేయడంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
లెఫ్ట్ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. త్వరలో సీపీఎం కేంద్ర నాయకత్వంతో ఢిల్లీలో కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత..సీపీఐ రాష్ట్ర నాయకులతో కేసీఆర్ సమావేశంకానున్నట్లు సమాచారం. ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై వామపక్ష నేతలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఈ విషయంలో మోడీ సర్కారుపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు వామపక్షాలతో కలిసి కార్యాచరణ సిద్ధం చేసే పనిలో సీఎం కేసీఆర్ ఉన్నారు.
Also Read..