Drugs: డ్రగ్స్ వాడిన వారు బాధితులు కాదు నిందితులే.. హైదరాబాద్ పోలీసుల వలలో ప్రముఖులు..

Hyderabad Drugs Case: హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలు కోసం డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు ముఠాల నుండి పోలీసులు కీలక ఆధారాలు

Drugs: డ్రగ్స్ వాడిన వారు బాధితులు కాదు నిందితులే.. హైదరాబాద్ పోలీసుల వలలో ప్రముఖులు..
Hyderabad Drugs Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 08, 2022 | 1:19 PM

Hyderabad Drugs Case: హైదరాబాద్ న్యూ ఇయర్ వేడుకలు కోసం డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు ముఠాల నుండి పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.. దేశ వ్యాప్తంగా డ్రగ్స్‌ను టోనీ అండ్ గ్యాంగ్ సప్లె చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో వారి మొబైల్ డేటా ఆధారంగా విచారణ చేయగా ప్రముఖుల వ్యవహారం బట్ట బయలైంది. ఇప్పటి వరకు డ్రగ్స్‌ను సప్లై చేసే వారిపై కేసులు పెట్టేవారు. కానీ ఇప్పుడు డ్రగ్స్‌కు బానిసై పదేపదే డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న వారి జాబితా పోలీసులకి చేరడంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టాలని పోలీసులు యోచిస్తున్నారు. “డ్రగ్స్ వాడిన వారు బాధితులు కాదు నిందితులేనని.. డ్రగ్స్ కోసం మెసేజ్ చేసినా నిందితులేనని’’ పోలీసులు పేర్కొంటున్నారు. అలాంటి వారు బాధితులు కాదంటూ పేర్కొంటున్నారు.

“గతంలో బాధితులు అన్న తెలంగాణ ప్రభుత్వం” రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న మూడు ముఠాల్లోని ఏడుగురిని పోలీసులు అరెస్టు చేయగా సంచలన విషయాలు వెలుగులు చూస్తున్నాయి. ముంబై కేంద్రంగా నడుస్తున్న ఈ దందా దేశ వ్యాప్తంగా టోనీ అండ్ గ్యాంగ్ డ్రగ్స్‌ను సప్లై చేస్తుంది. అయితే నూతన సంవత్సర వేడుకలకు ముంబైలో ఉన్న టోనీ గ్యాంగ్ హైదరాబాద్‌పై కన్నేసింది దీంతో హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఓ ఓయో రూమ్స్‌ను టార్గెట్‌గా చేసుకొని ముంబై నుండి తెచ్చిన డ్రగ్స్‌ను ఓయో రూమ్స్ నుంచి సరఫరా చేశారు. అయితే పోలీసులకు వచ్చిన సమాచారంతో డెకాయ్ ఆపరేషన్ చేసి టోనీ గ్యాంగ్‌లోని ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు.

“ఆపరేషన్ ఆంటోని’’ హైదరాబాద్ డ్రగ్స్‌ కేసులో ముంబై ముఠాని పట్టుకున్న తరువాత సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ముఠా నుండి వందల మంది డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇక పదేపదే డ్రగ్స్ కి అలవాటు పడిన 30 మంది ప్రముఖుల చిట్టాను పోలీసులు సేకరించారు. పోలీసులు సేకరించిన చిట్టాలో రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇక డ్రగ్స్‌కు అలవాటుపడ్డ వారిపై కఠినచర్యలకు హైదరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.

“డ్రగ్స్ కోసం మెసేజ్ చేసినా నిందితులే” ఇకపై డ్రగ్స్ వాడే వారి వివరాలు కూడా సేకరించబోతున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వాళ్లపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. డ్రగ్స్‌ బాధితుల విషయంలో ఇన్ని రోజులు మానవీయ కోణంలో ఆలోచించిన పోలీసులు అవసరమైతే వాళ్లను చట్ట ప్రకారం చర్యలకు తీసుకొనేందుకు రంగం సిద్ధం చేశారు. డ్రగ్స్‌ డిమాండ్‌ను తగ్గిస్తే సరఫరా అడ్డుకోవచ్చన్న సూత్రాన్ని పోలీసులు అమలు పరుచునున్నారు. ఎప్పుడో ఒక్కసారి డ్రగ్స్ తీసుకొనే వారి జాబితా రెడీ చేసి వారికి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సెలింగ్ చేయనున్నారు. ఇక తరుచుగా డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిని అరెస్టు చేసి జైలుకి పంపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.

అలాంటి వారిపై సెక్షన్ 25 కింద కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నారు. ఇక ఎక్కువగా ఈ డ్రగ్స్‌కు 18 ఏళ్ల నుండి 30 ఏళ్ళ లోపు ఉన్న యువత తీసుకుంటున్నట్లు విచారణలో తేలింది. కాలేజీ, ఉద్యోగం పేరుతో వెళ్లి డ్రగ్స్‌కు చాలా మంది యువత అలవాటు పడినట్లు సమాచారం. జాబితాలో ఉన్న పిల్లల్లో విషయంపై ఇప్పటి వరకు ప్రముఖులకు సమాచారం ఇవ్వలేదు. ఇక నుండి డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు కొత్త పద్దతుల్లో వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

విజయ్ సత్తా, టీవీ9 తెలుగు, క్రైం బ్యూరో

Also Read:

Lovers Suicide: సంగారెడ్డిలో విషాదం.. ప్రేమ జంట బలవన్మరణం.. నదిలోకి దూకి

Telangana: కరీంనగర్‌లో దారుణం.. ప్రియురాలిని చంపిన ప్రియుడు.. మూడు రోజుల క్రితం..

Vijayawada: దుర్గమ్మ దర్శనానికి వచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య..