Police Alert: “సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం” అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు!

సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది సొంతూర్లకు ప్రయాణమవుతారు. ఇదే అదనుగా భావించే దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పలు కీలక సూచనలు చేశారు.

Police Alert: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు!
Sankrathi Alert

Police Alert on on Sankrathi: సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది సొంతూర్లకు ప్రయాణమవుతారు. ఇదే అదనుగా భావించే దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ముమ్మరం చేశారు పోలీసులు. ఈ విషయంలో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ ప్రజలకు పలు సూచనలు చేశారు.

“అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు” సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు.. సైబరాబాద్ కమీషనరేట్లో పోలీసులు నిఘానేత్రం కింద ప్రజలు, కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ సహకారంతో ఇప్పటికే సీసీటీవీలను ఇన్‌స్టాల్ చేశారు. తద్వారా ఎన్నో సంచలనాత్మక నేరాలను ఛేదించారు. ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్‌ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలి. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటివారికి ఇంటి పరిసరాలను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టకూడదని పోలీసులు కోరుతున్నారు. ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి తప్పా, రోడ్లపై నిలుపరాదని, బీరువ తాళాలను ఇంట్లో ఉంచకుండా తమతోపాటే తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే, ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్‌ కర్టెన్‌ వేయాలి. గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్‌, పాల వారిని రావద్దని చెప్పాలి. పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు ఎవరికి చెప్పకూడదని పోలీసులు కోరుతున్నారు.

“ఈ సూచనలు పాటించండి “ విలువైన వస్తువుల సమాచారాన్ని ఇతరులకు చెప్పకూడదు. ఆరుబయట వాహనాలకు హాండిల్‌ లాక్‌తో పాటు వీల్‌ లాక్‌ వేయాలి. వాచ్ మెన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి. బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరిస్తారు.ఇంటి డోర్‌కు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్/ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సిసిటివి లు ఆన్లైన్/ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. హోమ్ సెక్యూరిటీ సర్వెలెన్స్ కు ఇవి ఎంతో ఉపయుక్తం.

అలాగే, ఇంటి భద్రతాపరంగా ఇంటికి దృఢమైన, నాణ్యమైన తలుపులతో పాటు హై ఎండ్ గోద్రెజ్ హై సెక్యూరిటీ లాక్ సిస్టం ని వాడడం మంచిది. తాళం వేయడం కంటే గోద్రెజ్ డోర్ లాక్ చేయడం వల్ల ఇంట్లో మనుషులు ఉన్నారా? లేరా? అనేది తెలియదు.సొంత ఇల్లు అయినట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి గ్రిల్స్ అమర్చుకోవడం ద్వారా రెండంచెల భద్రతనిస్తుంది. ఇంట్లో, ఇంటి బయట మోషన్ సెన్సర్ లను ఉపయోగించడం మంచిది. ఇంటి బయట మోషన్ సెన్సర్ లైట్లను ఉపయోగించండి. ఇవి చీకటి ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయి. సెన్సార్లు పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే లైట్ వెలుగుతుంది. సాధారణంగా సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్‌, బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.

“పోలీసులకు సమాచారం ఇవ్వండి “ ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. పోలీసు స్టేషన్‌ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్‌ కానిస్టేబుల్‌ నెంబర్‌ దగ్గర పెట్టుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం. అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలి. నమ్మకమైన సెక్యూరిటీ గార్డులను, వాచ్ మెన్ ను నియమించుకోవాలి.కాలనీవాళ్లు కమిటీలు వేసుకొని వాచ్‌మెన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకకోవాలి.రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వచ్చినా వారి వివరాలు తెలుసుకుని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవడం మంచిదని అపార్టుమెంట్‌ వాచ్‌మెన్‌లకు తెలపాలి.ఎప్పుడు కూడా స్థానిక పోలీసు స్టేషన్‌ నెంబర్‌ దగ్గరుంచుకోవడం మంచిది.దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్‌ లేదా సైబరాబాద్ పోలీసు వాట్సాప్‌ నెంబర్‌ 94906 17444 కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Read Also…  BSNL Offer: బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారే వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్‌..!

Published On - 1:51 pm, Sat, 8 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu