Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!
చంద్రగ్రహణం నేపథ్యంలో టిటిడీ కీలక ప్రకటన చేసింది. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల ఆలయం ఉదయం 9 నుండి రాత్రి 7:30 వరకు మూసి వేస్తున్నట్టు పేర్కొంది. ఈ సందర్భంగా మార్చి 2, 3వ తేదీలలో SSD టోకెన్లు, మార్చి 3న VIP దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్నప్రసాద వితరణ కేంద్రాలు కూడా నిలిపి వేస్తున్నట్టు తెలిపింది. భక్తులు మార్చి 1 నుండి 4 వరకు TTD సేవలు, దర్శనాల్లో మార్పులను గమనించి తదనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

తిరుమల శ్రీవారి దర్శనంపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2 వ తేదీల్లో SSD టోకెన్ల జారీని టిటిడి రద్దు చేసింది. టీటీడీ ఇప్పటికే ప్రకటించిన విధంగా మార్చి 3న చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు టైం స్లాటెడ్ టోకెన్లు జారీ చేయబడవని ప్రకటించింది. మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన SSD టోకెన్లు ముందురోజు అంటే మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయబడవని మరోసారి ప్రకటన జారీ చేసింది. తిరిగి మార్చి 4వ తేది దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మార్చి 3న జారీ చేయడం జరుగుతుందని పేర్కొంది. అదేవిధంగా మార్చి 3వ తేది వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా టిటిడి రద్దు చేసింది. మార్చి 2వ తేదిన వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది.
తిరుమల శ్రీవారి ఆలయం మూత.
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న తిరుమల ఆలయం మూతపడనుంది. ఉదయం 9 నుండి సాయంత్రం 7.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సుమారు 10.30 గంటల పాటు టీటీడీ మూసి వేయనుంది. మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై 6.47 గంటలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. తిరిగి సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు 8:30గం నుండి పునః ప్రారంభవుతుంది.
ఆర్జితసేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు టిటిడి రద్దు చేసింది. శ్రీవారి భక్తులు ఈ మేరకు ఆ రోజుల్లో తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించు కోవాల్సిందిగా కోరుతోంది.
టిటిడి అన్నప్రసాద వితరణ కేంద్రాల మూసివేత.
మార్చి 3న మంగళవారం చంద్రగ్రహణం కారణంగా టిటిడి అన్నప్రసాద వితరణ కేంద్రాలు మూతపడ నున్నాయి. తిరుమల, తిరుపతి, తిరుచానూరుతోపాటు టీటీడీ ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసి వేయనున్నారు. ఇందులో భాగంగా తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్‌లో గల ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్, అలాగే శ్రీనివాసం, విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేయనుంది అదేవిధంగా తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనుంది టిటిడి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
