Telangana: తండ్రిని దారుణం కొట్టి చంపిన భార్య, కొడుకు.. తెలంగాణలో ఘాతుకం..
సంగారెడ్డి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వృద్దుడిని భార్య, కుమారుడు కలిసి దారుణంగా హత్య చేశారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయాలతో వృద్దుడు ప్రాణాలు విడిచాడు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మానవ సంబంధాలు మంట గలిసిపోతున్నాయి. ఆస్తిపాస్తుల ముందు రక్త సంబంధం వెలవెలబోయింది. భూమి పంపకాల విషయంలో తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్న కొడుకు, కట్టుకున్న భార్య, తొడబట్టిన సోదరి కలిసి ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. ఈ దారుణమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెందిన తాజుద్దీన్ కొంతకాలంగా జహీరాబాద్‌లోని భారత్ నగర్‌లో అద్దెకు ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, సొంత గ్రామంలో ఉన్న భూమి పంపకం విషయంలో గత కొంతకాలంగా తాజుద్దీన్‌కు ఆయన భార్య, కుమారుడితో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ వివాదం ముదరడంతో కుటుంబ సభ్యులు రాక్షసంగా ప్రవర్తించారు.
తాజుద్దీన్‌ను అంతం చేయాలని పథకం వేసిన నిందితులు.. తొలుత ఆయన కళ్లలో కారం కొట్టారు. కళ్లు కనపడక తాజుద్దీన్ విలవిలలాడుతుండగానే.. కుమారుడు, భార్య, సోదరి కలిసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన తాజుద్దీన్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.. ఏదేమైనా ఆస్తి కోసం ఇలా తండ్రిని చంపడం మాత్రం సరైనది కాదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
