శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు, చిన్నారులతో వచ్చే తల్లులకు ప్రత్యేక దర్శనం
Ayodhya Ram Mandir Darshan: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శన విధానాన్ని అమలు చేస్తున్నారు. 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులు ముందస్తు అనుమతి లేకుండానే 'సుగమ దర్శనం' పాస్ పొందవచ్చు. చిన్నారులతో వచ్చే తల్లులకు ప్రత్యేక వెసులుబాటు, 10 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత దర్శనం వంటి సదుపాయాలు భక్తులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

Ayodhya Ram Mandir Telugu: శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి ఒక శుభవార్త వచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయ ట్రస్ట్ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక దర్శన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా వయోవృద్ధులు, చిన్నారులతో వచ్చే తల్లులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భక్తులు ఇకపై ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆలయ ప్రాంగణంలోని సుగమ దర్శనం కౌంటర్‌లో తమ వయస్సును నిర్ధారించే ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, పాస్‌పోర్ట్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపిస్తే, కేవలం 10 నిమిషాల్లోనే ‘సుగమ దర్శనం’ పాస్ జారీ చేస్తారు. ఈ పాస్ ద్వారా వారు సాధారణ క్యూలో ఎక్కువసేపు వేచి ఉండకుండా సౌకర్యవంతంగా శ్రీరాముడి దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు.
సహాయకుడికి కూడా అవకాశం
వయోవృద్ధులు ఒంటరిగా ప్రయాణించడం లేదా నడవడంలో ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున, వారికి తోడుగా ఒక సహాయకుడికి కూడా సుగమ దర్శనం ద్వారా ఆలయంలోకి ప్రవేశించే అనుమతి ఇవ్వనున్నారు. దీంతో వృద్ధ భక్తులు మరింత సౌకర్యంగా, భద్రంగా దర్శనం చేసుకోవచ్చు.
చిన్నారులతో వచ్చే తల్లులకు ప్రత్యేక వెసులుబాటు
మూడేళ్లలోపు చిన్నారులతో వచ్చే తల్లులకు కూడా ఆలయ ట్రస్ట్ ప్రత్యేక సౌకర్యం కల్పించింది. వారు నేరుగా సుగమ దర్శనం కౌంటర్‌లో పాస్ తీసుకుని, ఎక్కువసేపు క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.
10 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత దర్శనం
పదేళ్లలోపు పిల్లలకు ప్రత్యేక పాస్ అవసరం లేదు. వారు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి ఎలాంటి రుసుము లేకుండా నేరుగా ఆలయంలోకి ప్రవేశించి శ్రీరాముడి దర్శనం చేసుకోవచ్చు.
భక్తులకు మరింత సౌకర్యం కల్పించడమే లక్ష్యం
దేశ నలుమూలల నుంచి ప్రతి రోజు వేలాది మంది భక్తులు అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని సందర్శిస్తున్నారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వృద్ధులు, మహిళలు, చిన్నారులతో వచ్చే కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఈ ప్రత్యేక దర్శన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నిర్ణయంతో వృద్ధ భక్తులు, చిన్న పిల్లలతో వచ్చే తల్లులు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా శ్రీరాముని దర్శనం చేసుకునే అవకాశం మరింత సులభమైంది. భక్తుల సేవే ప్రధాన లక్ష్యంగా ఆలయ ట్రస్ట్ తీసుకున్న ఈ చర్యకు దేశవ్యాప్తంగా శ్రీరామ భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.




