AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు.. నెల రోజుల వేడుకలు! మోదీ బర్త్‌డే వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి?

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును బీజేపీ కేవలం వేడుకగా కాకుండా, నెలరోజుల పాటు 'సేవా సంకల్ప్ అభియాన్'గా నిర్వహిస్తోంది. రక్తదాన శిబిరాలు, ఆరోగ్య కార్యక్రమాలు, పరిశుభ్రత వంటి సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇది పార్టీ కార్యకర్తలను ప్రజలతో అనుసంధానించడానికి, నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తుచేయడానికి ఒక వ్యూహాత్మక కార్యక్రమం.

ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు.. నెల రోజుల వేడుకలు! మోదీ బర్త్‌డే వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి?
Pm Modi BirthdayImage Credit source: AI Image
Siva Nagaraju
| Edited By: |

Updated on: Sep 17, 2026 | 11:21 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ76వ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సాధారణంగా పుట్టినరోజంటే కేకులు, శుభాకాంక్షలు, కొద్దిపాటి కార్యక్రమాలు ఉంటాయి. కానీ ప్రధాని మోదీ బర్త్‌డే మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద కార్యక్రమంగా మారింది. భారతీయ జనతా పార్టీ ఈ పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో ముడిపెట్టింది. ఈసారి మరో అంశం కూడా కలిసొచ్చింది. మోదీ ప్రజా జీవితంలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తవుతోంది. అందుకే పుట్టినరోజుతో పాటు ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని కూడా గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

పుట్టినరోజు.. సేవా కార్యక్రమం

ప్రధాని మోదీ పుట్టినరోజును బీజేపీ సేవా దినంగా నిర్వహిస్తోంది. రక్తదాన శిబిరాలు, ఆరోగ్య కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చెప్పే కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అంటే పుట్టినరోజు ఒక్కరోజు వేడుకగా ఉండడం లేదు. దాన్ని నెలరోజుల కార్యక్రమంగా మార్చారు. పార్టీ కార్యకర్తలు గ్రామాలు, పట్టణాల్లో ప్రజల దగ్గరకు వెళ్లేలా కార్యక్రమాలు పెట్టారు.

ఆశీర్వాద దీపం..

ఈసారి బర్త్‌డే వేడుకల్లో ఆశీర్వాద కా దియా ప్రత్యేకంగా నిలుస్తున్నారు. సెప్టెంబర్ 17న ఇళ్లలో దీపాలు వెలిగించాలని బీజేపీ పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా 500కు పైగా ప్రముఖ ప్రాంతాల్లో కూడా దీపాలు వెలిగించారు. ఇది ఒక చిన్న కార్యక్రమంలా కనిపించినా.. దాని వెనుక పెద్ద ప్రజా భాగస్వామ్య ఆలోచన ఉంది. పార్టీ ఆఫీసులో కార్యక్రమం పెడితే పార్టీ వాళ్లు వస్తారు. ఇంట్లో దీపం వెలిగించే కార్యక్రమం పెడితే సామాన్య ప్రజలు కూడా భాగస్వాములు అవుతారు.

బీజేపీకి ఏంటి లాభం?

ఇక్కడే అసలు రాజకీయ కోణం కనిపిస్తుంది. ఒక నాయకుడి పుట్టినరోజును పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తే కార్యకర్తలంతా ఒకేసారి రంగంలోకి వస్తారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ శ్రేణులకు ఒకే కార్యక్రమం దొరుకుతుంది. ప్రజలను కలవడానికి కూడా ఇది ఒక అవకాశం. ఆరోగ్య శిబిరం పెట్టొచ్చు. రక్తదాన కార్యక్రమం చేయొచ్చు. పరిశుభ్రత కార్యక్రమం చేపట్టొచ్చు. అదే సమయంలో ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించొచ్చు. అంటే ఒకే కార్యక్రమంలో సేవ కూడా జరుగుతుంది. ప్రజలతో పరిచయం కూడా పెరుగుతుంది. పార్టీ కార్యకర్తలకు కూడా పని దొరుకుతుంది.

పథకాల ప్రచారానికి ఒక వేదిక

గ్రామంలో ఒక పథకం గురించి చెప్పాలంటే ఇంటింటికీ వెళ్లాలి. ఎవరికేం పథకం వస్తుందో చెప్పాలి. ఎవరు లబ్ధిదారులో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అందుకు ఒక వేదికగా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలవడం, పథకాలపై అవగాహన కల్పించడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం వంటివి కూడా ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉన్నాయి. బీజేపీ ప్రకటించిన సేవా సంకల్ప్ అభియాన్‌లో ప్రజా భాగస్వామ్యం, సంక్షేమ కార్యక్రమాలు, యువతతో అనుసంధానం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

కార్యకర్తలకు పెద్ద టాస్కే

పార్టీకి కేవలం సభలు పెట్టడం సరిపోదు. కార్యకర్తలు ప్రజల్లో ఉండాలి. గ్రామాల్లో తిరగాలి. స్థానిక సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పాలి. ప్రధాని మోదీ పుట్టినరోజు పేరుతో నెలరోజుల కార్యక్రమాలు పెట్టడం వల్ల పార్టీ శ్రేణులు కూడా కదులుతాయి. ఒక్కరోజు కార్యక్రమం కంటే నెలరోజుల కార్యక్రమం అంటే సంస్థ మొత్తం యాక్టివ్‌గా ఉంటుంది. ఒక్క చేత్తో చప్పట్లు పడవు. పార్టీ కార్యక్రమం విజయవంతం కావాలంటే నాయకులు ఒకవైపు, కార్యకర్తలు మరోవైపు, ప్రజల భాగస్వామ్యం ఇంకోవైపు ఉండాలి.

మోదీ వ్యక్తిత్వం.. పార్టీ కార్యక్రమం

ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో ప్రధాని వ్యక్తిత్వం ప్రధానంగా కనిపిస్తుంది. అదే సమయంలో కార్యక్రమాలను బీజేపీ సంస్థ నిర్వహిస్తుంది. దీంతో మోదీ అనే నాయకుడి పుట్టినరోజు. బీజేపీ కార్యకలాపాలకు ఒక వేదికగా మారుతుంది. ఆయన 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని కూడా ఈ కార్యక్రమాలతో గుర్తు చేస్తున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ప్రజా జీవితం నుంచి ప్రధానిగా కొనసాగుతున్న ప్రస్థానాన్ని పార్టీ కార్యక్రమాల్లో ప్రస్తావిస్తోంది.

సేవ ఎంత.. ప్రచారం ఎంత?

ఇక్కడే మరో ప్రశ్న వస్తుంది. ఇలాంటి కార్యక్రమాల్లో సేవ ఒక భాగం. ప్రచారం కూడా ఒక భాగమేనా అన్నది రాజకీయ విశ్లేషణలో చర్చించే అంశం. బీజేపీ మాత్రం వీటిని సేవా కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్యం, సంక్షేమ పథకాల అవగాహన కార్యక్రమాలుగా ముందుకు తీసుకెళ్తోంది. బయట నుంచి చూసినప్పుడు మాత్రం సేవా కార్యక్రమం, పార్టీ ఔట్‌రీచ్ రెండూ ఒకే వేదికపై కనిపిస్తున్నాయి. గ్రామంలో మన పెద్దలు చెప్పే మరో మాట ఉంది. మొక్క చిన్నదైనా నీడ పెద్దదే. ఒక దీపం చిన్నదే కావచ్చు. కానీ అదే దీపాలు వందల్లో, వేలల్లో వెలిగితే అది పెద్ద కార్యక్రమంగా కనిపిస్తుంది.

నెలరోజుల పాటు…

మొత్తంగా చూస్తే.. మోదీ 76వ పుట్టినరోజును బీజేపీ కేవలం శుభాకాంక్షల రోజుగా చూడటం లేదు. సేవా కార్యక్రమాలు, ప్రజా భాగస్వామ్యం, సంక్షేమ పథకాల ప్రచారం, కార్యకర్తల యాక్టివేషన్.. ఇవన్నీ ఒకే కార్యక్రమంలో కలిపింది. ఇది ఒకవైపు మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని గుర్తు చేసే సందర్భం. మరోవైపు పార్టీ కార్యకర్తలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం. ఇంకోవైపు ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే వేదిక. అందుకే మోదీ బర్త్‌డే బీజేపీకి ఒక సాధారణ పుట్టినరోజు కార్యక్రమంగా కాకుండా.. పార్టీ, ప్రభుత్వం, కార్యకర్తలు, ప్రజలు ఒకచోట కలిసే పెద్ద ఔట్‌రీచ్‌గా మారింది.

కొండవీటి శివనాగరాజు డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9.

Follow Us