kidney stones Vs Beer: బీరు తాగితే.. నిజంగానే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా?
నేటి జీవనశైలి కారణంగా చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల కడుపు నొప్పి కూడా వస్తుంది. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగి పోతాయని చాలా మంది చెబుతుంటారు. ఇందులో ఎంత నిజం ఉందో ఇక్కడ తెలుసుకుందాం..

బీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయని ఒక పెద్ద అపోహ వ్యాపించి ఉంది. వైద్య నిపుణులు ప్రకారం దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారం లేదు. పైగా బీరు తాగడం వల్ల మూత్రపిండాలకు మరింత హాని కలుగుతుందని చెబుతున్నారు. కిడ్నీ రోగులు బీర్ తాగడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
డీహైడ్రేషన్ ప్రమాదం
బీరు ఒక మూత్రవిసర్జన కారకం. అంటే దీనిని తాగడం వల్ల మూత్రం ఉత్పత్తి అయ్యే పరిమాణం మరింత పెరుగుతుంది. దీనివల్ల శరీరం నుంచి నీరు వేగంగా పోతుంది. దీంతో శరీరం డీహైడ్రేట్ అవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు బయటకు రావడానికి అధిక నీటి స్థాయిలు అవసరం. కానీ బీరు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఇది రాళ్లు గట్టిపడటానికి కారణమవుతుంది.
యూరిక్ యాసిడ్ – ప్యూరిన్లు
బీరులో ‘ప్యూరిన్’ అనే పదార్థం పెద్ద మొత్తంలో ఉంటుంది. ప్యూరిన్లు జీర్ణమైన తర్వాత శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. మీరు తరచుగా బీరు తాగితే శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఉన్న రాళ్లకు బదులు కొత్త రాళ్ళు ఏర్పడే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది.
రాళ్ల పరిమాణం ముఖ్యం
కిడ్నీ రాయి 5 మి.మీ కంటే పెద్దగా ఉంటే అది ఏ పానీయంతోనూ దానంతట అదే బయటకు వెళ్ళదు. అలాంటి సందర్భంలో బీరు వల్ల మూత్ర పీడనం పెరిగితే రాయి మూత్ర నాళంలో ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది.
కిడ్నీ రాళ్ల సమస్య నివారణకు ఏం చేయాలి?
మూత్రపిండాల్లో రాళ్లకు బీర్ నివారణ కాదు. మూత్రం ఎక్కువగా రావడం వల్ల తాత్కాలికంగా రాళ్లు పోయినట్లు అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలంలో ఇది శరీరానికి హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకూ ఇలాంటి సమస్య ఉంటే అపోహలను వీడి వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




