Hojicha: కెఫీన్ తక్కువ.. రుచి ఎక్కువ! ఈ కొత్త రకం జపనీస్ టీతో ఎన్ని ప్రయోజనాలో..
గత కొన్నాళ్లుగా ప్రపంచాన్ని ఊపేసిన గ్రీన్ టీ లేదా 'మచ్చా' (Matcha) క్రేజ్ ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతోంది. దాని స్థానంలో 2026లో జపాన్‌కు చెందిన 'హోజిచా' (Hojicha) అనే సరికొత్త టీ రకం వెలుగులోకి వచ్చింది. పచ్చగా ఉండే సాధారణ టీ ఆకులకు భిన్నంగా, ఎర్రటి గోధుమ రంగులో ఉండే ఈ టీ.. తన అద్భుతమైన సువాసనతో పానీయాల ప్రియులను ఆకట్టుకుంటోంది. తక్కువ కెఫీన్ ఉండటం మరియు మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడం దీని ప్రత్యేకత. హెల్త్ , టేస్ట్ రెండింటినీ కోరుకునే వారికి హోజిచా ఇప్పుడు ఒక వరంలా మారింది.

2026 పానీయాల ట్రెండ్స్ అన్నీ ‘బ్యాలెన్స్’, ‘కంఫర్ట్’ చుట్టూ తిరుగుతున్నాయి. అతిగా ఉత్సాహాన్ని ఇచ్చే పానీయాల కంటే, మనసును తేలికపరిచే డ్రింక్స్ కోసం ప్రజలు వెతుకుతున్నారు. అందుకే జపాన్ సంప్రదాయ ‘హోజిచా’ టీకి డిమాండ్ పెరిగింది. ఇది కేవలం టీ కప్పులకే పరిమితం కాకుండా కేకులు, ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లలో కూడా తన రుచిని చాటుతోంది. మచ్చా టీకి ఇది ఎలా ప్రత్యామ్నాయంగా మారుతుందో, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
హోజిచా ఎందుకు ప్రత్యేకం?
తక్కువ కెఫీన్ : టీ ఆకులను వేయించడం వల్ల అందులోని కెఫీన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. దీనివల్ల రాత్రిపూట కూడా ఈ టీని నిరభ్యంతరంగా తాగవచ్చు. చిన్న పిల్లలు మరియు వృద్ధులకు కూడా ఇది సురక్షితం.
కమ్మని సువాసన: సాధారణ గ్రీన్ టీలో ఉండే పసరు వాసన దీనికి ఉండదు. ఇది కాల్చిన గింజల వంటి సువాసనను, పొగ వాసనను కలిగి ఉంటుంది.
మచ్చా వర్సెస్ హోజిచా: మచ్చా టీ ఎనర్జీని పెంచడానికి ఉపయోగపడితే, హోజిచా మనసును ప్రశాంతంగా ఉంచడానికి (Calming effect) ఉపయోగపడుతుంది.
కేఫ్‌లలో నయా ట్రెండ్: ప్రస్తుతం నగరాల్లోని కేఫ్‌లలో హోజిచా లాట్టే అత్యంత ప్రజాదరణ పొందుతోంది. దీనికి పాలు లేదా ఓట్ మిల్క్ కలిపినప్పుడు వచ్చే కారామెల్ రుచి అద్భుతంగా ఉంటుంది. కేవలం పానీయంగానే కాకుండా, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు మరియు ఇతర స్వీట్లలో దీన్ని ఒక ఫ్లేవర్‌గా ఉపయోగిస్తున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు: ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ లాగే ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, కానీ పొట్టలో ఎటువంటి అసౌకర్యం కలిగించదు.
