AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫైబర్ మాక్సింగ్ అంటే ఏమిటి? బరువు తగ్గాలనే ఆరాటంలో లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి!

ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగిన తర్వాత చాలామంది ఇప్పుడు కొత్త రకమైన డైట్ పద్ధతులను అనుసరిస్తున్నారు. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ‘ఫైబర్ మాక్సింగ్’. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టాలన్నా, జీర్ణక్రియ మెరుగుపడాలన్నా పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని అందరూ భావిస్తుంటారు.

ఫైబర్ మాక్సింగ్ అంటే ఏమిటి? బరువు తగ్గాలనే ఆరాటంలో లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి!
Fibre Mixing.
Nikhil
|

Updated on: Jan 07, 2026 | 11:29 PM

Share

అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. ఏదైనా హద్దు దాటితే అది అమృతంలా కాకుండా విషంలా మారుతుంది. పీచు పదార్థాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. గట్ ఆరోగ్యం కోసం అతిగా ఫైబర్ తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అసలు రోజుకు ఎంత ఫైబర్ తీసుకోవాలో, ఫైబర్ మాక్సింగ్ వల్ల వచ్చే అనర్థాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎవరికి ఎంత ఫైబర్ అవసరం?

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, వయస్సును బట్టి మనం తీసుకునే ఫైబర్ పరిమాణం మారుతుండాలి. పెద్దలు రోజువారీ ఆహారంలో సుమారు 30 గ్రాముల పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి. 15 ఏళ్లలోపు పిల్లలకు 20 గ్రాములు, మూడేళ్లలోపు చిన్నారులకు కేవలం 15 గ్రాముల ఫైబర్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే శరీరంలోని సున్నితమైన జీర్ణ వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది.

అతిగా పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల పేగుల్లో చికాకు కలగడం, కడుపు బిగుతుగా ఉండటం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువైనప్పుడు తగినంత నీరు తాగకపోతే మలబద్ధకం సమస్య మరింత జటిలమవుతుంది. అంతేకాకుండా, ఆహారంలోని క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి కీలక పోషకాలను శరీరం గ్రహించకుండా ఈ ఫైబర్ అడ్డుకుంటుంది. దీనివల్ల బరువు విపరీతంగా తగ్గడంతో పాటు పేగుల్లో అడ్డంకులు కూడా ఏర్పడే ప్రమాదం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఫైబర్ మాక్సింగ్ డైట్ పాటించేవారు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించడం అవసరం. ఒకేసారి కాకుండా ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. అప్పుడే జీర్ణాశయం ఆ మార్పుకు అలవాటు పడుతుంది. పీచు పదార్థాలు తీసుకున్నప్పుడు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. లేకపోతే కడుపులో తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

కృత్రిమ ఫైబర్ పౌడర్లకు బదులుగా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, తృణధాన్యాలను ఎంచుకోవాలి. విభిన్న రకాల ఫైబర్లు అందాలంటే మొక్కల ఆధారిత ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పెరుగులో విత్తనాలు వేసుకోవడం లేదా సలాడ్స్ తీసుకోవడం మంచి పద్ధతి. పీచు పదార్థాలు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయనేది నిజం. కానీ వాటిని పరిమితికి లోబడి తీసుకున్నప్పుడే ఆ ప్రయోజనాలు లభిస్తాయి. గట్ ఆరోగ్యం పేరుతో చేసే ప్రయోగాలు ప్రాణాల మీదకు రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం.