పెరుగు Vs మజ్జిగ.. ఆ సమస్యలకు ఏది బెస్ట్..? అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
Curd vs Buttermilk: మనం రోజూ తినే భోజనంలో పెరుగు లేదా మజ్జిగ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. కడుపులో మంట, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలు వేధిస్తున్నప్పుడు పెరుగు తినాలా? లేక మజ్జిగ తాగాలా? అనే సందేహం చాలా మందిలో వస్తుంటుంది. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారతీయ భోజనంలో పెరుగు లేదా మజ్జిగ లేనిదే ముద్ద దిగదు. ఈ రెండూ పాలతో తయారైన సహజ ప్రోబయోటిక్ ఆహారాలే అయినప్పటికీ, ఆరోగ్య సమస్యలను బట్టి వీటి ప్రభావం మారుతుంటుంది. ముఖ్యంగా అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పెరుగు తినాలా లేక మజ్జిగ తాగాలా? అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనిపై పోషకాహార నిపుణులు చెబుతున్న ఆసక్తికర విషయాలు తెలిపారు. పెరుగు, మజ్జిగ రెండింటిలోనూ మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం, ప్రోటీన్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
అసిడిటీ వేధిస్తుందా? అయితే మజ్జిగే మేలు
మీకు తరచుగా కడుపులో మంట లేదా గ్యాస్ సమస్యలు ఉంటే పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగ చాలా తేలికగా ఉంటుంది మరియు ఇందులో నీటి శాతం ఎక్కువ. ఇది కడుపులోని మంటను తగ్గించి చల్లబరుస్తుంది. మజ్జిగలో కాల్చిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు లేదా పుదీనా కలుపుకుని తాగితే గ్యాస్ సమస్య నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎక్కువ పుల్లగా ఉన్న పెరుగు తింటే కొంతమందిలో అసిడిటీ మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తాజా పెరుగునే వాడాలి.
మలబద్ధకం సమస్యకు పరిష్కారం
మలబద్ధకంతో బాధపడేవారికి పెరుగు, మజ్జిగ రెండూ మేలు చేస్తాయి. వీటిలోని ప్రోబయోటిక్స్ పేగు కదలికలను మెరుగుపరుస్తాయి. మజ్జిగ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా మల విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది.
గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయాలు
- ఎప్పుడూ తాజాగా తోడుపెట్టిన పెరుగు లేదా మజ్జిగనే తీసుకోవాలి. నిల్వ ఉన్న పుల్లటి పెరుగు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
- రాత్రి సమయంలో పెరుగు ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియ మందగించే అవకాశం ఉంది.
- ఏదైనా సరే సమతుల్య పరిమాణంలో తీసుకున్నప్పుడే పూర్తి ఫలితం ఉంటుంది.
అసిడిటీ, మలబద్ధకం వంటి తక్షణ సమస్యలకు మజ్జిగ ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. రోజువారీ పేగు ఆరోగ్యం కోసం తాజా పెరుగును తీసుకోవడం మంచిది.
