హౌరా జిల్లాలోని శ్యాంపూర్ అసెంబ్లీ సీటులో బీజేపీ.. ప్రముఖ బెంగాలీ సినీ నటి తనూశ్రీ చక్రవర్తిని అభ్యర్థిగా ప్రకటించింది. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కలిపాద మండలానికి టీఎంసీ టికెట్‌ను కేటాయించింది. కలిపాద మండలం 2001 నుంచి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. శ్యాంపూర్ అసెంబ్లీ ఉలుబేరియా లోక్‌సభ నియోజకవర్గంలో వస్తుంది. తృణమూల్ ఎంపీ సజ్దా అహ్మద్ ఇక్కడి నుంచే గెలుపొందారు. ఇక్కడ ఇప్పటివరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో ఆరుసార్లు ఫార్వర్డ్ బ్లాక్, కాంగ్రెస్ ఐదుసార్లు, జనతా పార్టీ ఒకసారి, టీఎంసీ నాలుగుసార్లు గెలిచింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కలిపాద మండలం.. కాంగ్రెస్‌కు చెందిన అమితాబ్ చక్రవర్తిని 26 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. బీజేపీకి కేవలం 8,000 ఓట్లు మాత్రమే వచ్చాయి.