Bengal :తృణమూల్‌ను వదిలి వెళ్లిన బీజేపీలో చేరిన నేతల్లో అంతర్మథనం.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతీయ జనతాపార్టీని ముప్పుతిప్పులు పెట్టేట్టుగా ఉన్నారు. బెంగాల్‌లో పాగా వేసి మమతను ఇంటికి పంపించాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ ఎన్నో పథకాలు వేసింది. పన్నాగాలు కూడా పన్నింది..
Bengal : బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారతీయ జనతాపార్టీని ముప్పుతిప్పులు పెట్టేట్టుగా ఉన్నారు. బెంగాల్‌లో పాగా వేసి మమతను ఇంటికి పంపించాలన్న ఏకైక లక్ష్యంతో బీజేపీ ఎన్నో పథకాలు వేసింది. పన్నాగాలు కూడా పన్నింది.. తృణమూల్ కాంగ్రెస్ నుంచి చాలా మందిని నయానో భయానో తమవైపుకు తిప్పుకుంది.. ఇక తృణమూల్ పని అయిపోయినట్టేనని ప్రచారం చేయించింది.. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 292 అసెంబ్లీ స్థానాలలో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలను గెల్చుకుంది. అసలు ఇన్ని స్థానాలు వస్తాయని ఎవరూ ఊహించలేదు. మరోవైపు అధికారంలోకి వస్తామని ఆశపడ్డ బీజేపీ 77 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. నిజానికి ఇంతటి విజయాన్ని సాధించడానికి మమతా బెనర్జీ చాలా శ్రమించారు. తన దగ్గరి వాళ్లంతా పార్టీని విడిచిపెట్టిపోతున్నా ఏ మాత్రం కుంగిపోలేదు.. ఆత్మవిశ్వాసాన్ని వదలుకోలేదు.. తన మంత్రివర్గంలో ఉన్నవారు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు అంతా బీజేపీలో చేరినప్పటికీ పోరాటం ఆపలేదు..మునుపటి తెగువనే ప్రదర్శించారు. మోదీ, అమిత్‌షాలతో సై అంటే సై అన్నారు. చివరికి ఎన్నికల రణక్షేత్రంలో విజయాన్ని కైవసం చేసుకున్నారు..
ఎన్నికల ముందేమో కానీ.. ఇప్పుడు బెంగాల్‌లో ఖేలా హోబే జరుగుతోంది.. అక్కడ ఆట మొదలయ్యింది.. అమియో ఆచ్చి, తుమియో రొబే, బంధూ, ఏబార్ ఖేలా హోబే..ఖేలా ఖేలా ఖేలా హోబే… తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన పాట ఇది! నేనూ ఉన్నా, నువ్వూ ఉన్నావ్, స్నేహితుడా ఈ సారి ఆట జరుగుతుందిలే..!ఇదీ ఆ పాట పల్లవికి తెలుగు అర్థం….అవును.. ఇప్పుడు బెంగాల్‌లో ఆట జరుగుతోంది… అది రివర్స్ మైగ్రేషన్ ఆట… తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరినవారంతా ఇప్పుడు మళ్లీ వెనక్కి వచ్చే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే కొందరు శరణు మాత శరణు .. అంటూ మమతను వేడుకున్నారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. టీఎంసీ ఘన విజయం సాధించడంతో పార్టీ ఫిరాయింపుదారులంతా మళ్లీ తృణమూల్‌లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. 2017లో మమతకు తొలి షాక్ ఇచ్చి పార్టీని విడిచి పెట్టిన బీజేపీ నేత ముకుల్ రాయ్ కూడా వెనక్కి వచ్చేయాలనుకుంటున్నారు. గత మార్చిలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహా అయితే మొన్న కన్నీళ్లు పెట్టుకుని మరి మమతను అభ్యర్థించారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు దీపేందు బిస్వాస్ తృణమూల్‌లో రావడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితోపాటు సరాలా ముర్ము , అమల్ ఆచార్య తదితరులుకూడా ఇదే బాటలో ఉన్నారట!
అంతేనా..ఇంకా చాలా ఉంది.. ఏడు నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు నలుగురు బీజేపీ ఎంపీలు కూడా తృణమూల్‌లోకి రావడానికి ఉత్సాహపడుతున్నారట! అయితే తనకు కాదని వెళ్లిపోయినవారిని మమత రానిస్తారా? వారిని క్షమిస్తారా? ఇప్పటి వరకైతే మమతా బెనర్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు బీజేపీ ఇవన్నీ నిరాధారమైన వార్తలుగా కొట్టిపారేసింది. ముకుల్‌రాయ్ మళ్లీ టీఎంసీలో చేరనున్నారని వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపింది. మమతా బెనర్జీ ఒక్కసారి గేట్లు తెరిస్తే మాత్రం వలస పక్షులన్నీ తిరిగి తమ సొంత గూటికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి మోదీ, అమిత్‌షా తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రతీకారానికి పాల్పడుతున్నరని విమర్శించిన మమతా బెనర్జీ ఇప్పుడు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్రం బెదిరింపులకు బెదిరేది లేదని సూటిగా చెప్పారు. పైగా హిందీ సినిమా షోలే లోని పాపులర్ డైలాగ్… జో డరతే హై..వో మరతే హై అనే డైలాగును గుర్తు చేశారు. ఇక ఇప్పుడు బెంగాల్‌లో ఖేలా హోబే ఆట ఎంత రసవత్తరంగా సాగుతుందో చూడాలి..
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఓనర్స్ పనితో షాక్‌తిన్న కుక్కపిల్ల…నవ్వులే నవ్వులే ..వైరల్ అవుతున్న వీడియో : Dog funny video viral.
యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.