Mamata Banerjee Takes Oath: పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ.. తొలి ప్రాధాన్యత అదేనంటూ ప్రకటన..
Mamata Banerjee Takes Oath: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
Mamata Banerjee Takes Oath: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్.. మమతా బెనర్జీ చేత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడాంబరంగా జరిగింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలెవరినీ ఆహ్వానించలేదు. కాగా, ఇవాళ మమతా బెనర్జీ మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. మే 6వ తేదీన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయనుందని తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో టిఎంసి సీనియర్ నాయకులు పార్థా ఛటర్జీ, సుబ్రతా ముఖర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పాల్గొన్నారు.
కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం మమతా బెనర్జీ ప్రసంగించారు. రాష్ట్రంలో కోవిడ్‌ను నియంత్రించడమే తన మొదటి ప్రాధాన్యత అని ప్రకటించారు. తనకు మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలందరూ ఇప్పుడు బెంగాల్ వైపు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సహనంతో ఉండాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే సహించేది లేదని స్పష్టం చేశారు. హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. బెంగాల్ గతంలో ఎన్నో సంక్షోభాలు చూసిందని, ప్రస్తుతం మనముందున్న కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడమే తన మొదటి కర్తవ్యం అని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు కోవిడ్ నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష జరుపుతామని ప్రకటించారు. సాయంత్రం 3 గంటలకు విలేకరుల సమావేశంలో పూర్తి సమాచారాన్ని వెల్లడించడం జరుగుతుందన్నారు. ఇదిలాఉండగా.. బెంగాల్ శాంతిని కాపాడండి అంటూ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. హింసకు తావివ్వకూడదని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటమనేది తన రెండవ ప్రాధాన్యత అని సీఎం స్పష్టం చేశారు. హింసకు పాల్పడిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు.
మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీకి రాష్ట్ర గవర్నర్ జగ్‌దీప్ ధన్‌ఖర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ముందు అతిపెద్ద సంక్షోభం ఉందని, ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సహకార సమాఖ్య వాదాన్ని అనుసరిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించిన బీజేపీ.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత.. బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడటంపై ఆ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ బహిష్కరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
Also read:
Telangana Weather Updates: తెలంగాణలో మే 5, 6 తేదీల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వానలు