తూర్పు మెడినిపూర్ జిల్లాలోని మొయినా అసెంబ్లీ నియోజకవర్గంలో.. బీజేపీ మాజీ క్రికెటర్ అశోక్ దిండాకు టికెట్ ఇచ్చింది. కాగా.. టీఎంసీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే సంగ్రామ్ కుమార్ దోలై కే మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. మొయినా అసెంబ్లీ తమ్లుక్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి బీజేపీ నాయకుడు సుభేందు అధికారి సోదరుడు దివ్యేందు అధికారి ఎంపీగా ఉన్నారు. గతంలో రెండుసార్లు జరిగిన ఎన్నికలలో మొయినా నుంచి టీఎంసీ అభ్యర్థులే విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికలలో బీజేపీ మూడవ స్థానంలో నిలిచింది. 2011 ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్థి భూషణ్ చంద్ర దోలై ఇక్కడి నుంచి గెలుపొందారు. 2016లో టీఎంసీ నుంచి సంగ్రామ్ కుమార్ డోలై పోటీ చేసి లక్షకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు. ఈసారి అశోక్ దిండా సహాయంతో ఈ సీటును గెలిచేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇక్కడ రెండో దశలో ఏప్రిల్ 1న ఓటింగ్ జరగనుంది. మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి.