Apple Target: భారతదేశంలో ఆపిల్ టార్గెట్ ఫిక్స్.. ప్రత్యేక పథకంతో ఎగుమతుల పెంపే లక్ష్యం
ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ఉత్పత్తులంటే ప్రత్యేక క్రేజ్ ఉంది. ముఖ్యంగా యువత ఆపిల్ ఫోన్‌లను వాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆపిల్ ఉత్పత్తుల తయారీ ఎక్కువగా చైనా కేంద్రంగా జరిగేది. కానీ ప్రస్తుతం భారతదేశంలో కూడా ఆపిల్ ఉత్పత్తుల తయారీ గణనీయంగా పెరిగింది. మరో రెండు మూడేళ్లకు సంబంధించి యాపిల్ రోడ్ మ్యాప్ తయారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆపిల్ నయా ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆపిల్ కంపెనీ దాని ముఖ్య సరఫరాదారుల సహకారంతో 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి గ్లోబల్ ఐఫోన్ ఉత్పత్తి పరిమాణంలో 32 శాతం భారత్‌లో సమీకరించడానికి ప్రతిష్టాత్మకంగా పని చేస్తుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ద్వారా 2027 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో ఐఫోన్‌ల ఉత్పత్తి విలువను 34 బిలియన్ల డాలర్లకు మించి పెంచే సామర్థ్యంతో పని చేస్తామని ఆపిల్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్లోబల్ ఐఫోన్ విక్రయాలు 2023-24 స్థాయిలకు అనుగుణంగా ఉంటే ప్రపంచ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి ల్యాండ్‌స్కేప్‌లో భారతదేశ స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఆపిల్ ప్రస్తుత ఉత్పత్తి విలువ 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తి పరిమాణంలో సుమారు 12-14 శాతం వాటాను అందించింది
2025 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 18 బిలియన్ల డాలర్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. అలాగే మార్కెట్ విలువ 27 బిలియన్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధ భాగంలో మాత్రమే 9 బిలియన్ల డాలర్ల ఫ్రైట్-ఆన్-బోర్డ్ ఉత్పత్తి విలువను అంచనా వేశారు . ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ప్రపంచ ఐఫోన్ ఉత్పత్తి పరిమాణంలో భారతదేశం 17-18 శాతంగా ఉంది. అలాగే ఉత్పత్తి విలువ పరంగా 14 శాతం వాటాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఐఫోన్ సక్సెస్ మోడల్ అయిన ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఎక్కువగా భారతదేశంలో ఉత్పత్తి చేస్తున్నందున ఉత్పత్తి విలువతో పాటు అమ్మకపు విలువ ఈ ఆర్థిక సంవత్సరంలో అధికంగా ఉంది. ఆపిల్‌తో పాటు ఆ కంపెనీ సరఫరాదారులతో భారతదేశ ప్రభుత్వ చర్చలు ఈ ప్రతిష్టాత్మక ఉత్పత్తి లక్ష్యాలను సులభతరం చేశాయి. అలాగే ఆపిల్ ఉత్పత్తుల తయారీ పర్యావరణ వ్యవస్థకు సహాయక వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. పీఎల్ఐ పథకం కింద భారతదేశంలో ఐఫోన్ అసెంబ్లీని పెంచే ఈ చర్యలు మేక్ ఇన్ ఇండియా చొరవకు అనువుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భారతదేశాన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఉంచడానికి ఆపిల్ చర్యలు దోహదం చేస్తాయని పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి