Stock Market News : న్యూ ఇయర్ సెంటిమెంట్‌.. దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో

న్యూ ఇయర్ సెంటిమెంట్‌ స్టాక్ మార్కెట్‌పై బాగానే పని చేస్తోంది. సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. మెరుగైన అమ్మకాలు ఊపందుకోవడం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయింది. మిగిలిన షేర్లు లాభాల్లో ముగిశాయి. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Stock Market News : న్యూ ఇయర్ సెంటిమెంట్‌..  దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో
Stock Market
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 02, 2025 | 8:47 PM

న్యూ ఇయర్ సెంటిమెంట్‌తో దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. అయితే నష్టాలు.. లేదంటే ఓ మోస్తరు లాభాలకే పరిమితమైన సూచీలు.. చాలా రోజుల తర్వాత భారీ లాభాలను నమోదు చేశాయి. ఇంట్రాడేలో 78,542 కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌.. ఒక దశలో 80,032 పాయింట్ల మార్క్‌ని అధిగమించింది. చివరకు 1,436 పాయింట్ల లాభంతో 79,943 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ దాదాపు 450 పాయింట్లు లాభపడి 24,200 మార్కుకు చేరువైంది. ఇన్వెస్టర్ల సంపద ఒకేరోజు రూ.6 లక్షల కోట్లు పెరిగింది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌, ఆటో, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. డిసెంబర్ నెలకు సంబంధించి వాహన పరిశ్రమలో అంచనాలను తలకిందులు చేస్తూ మెరుగైన అమ్మకాలు ఊపందుకోవడం, మూడో త్రైమాసికానికి సంబంధించి ఐటీ రంగ కంపెనీల ఆదాయాలు అత్యంత సానుకూలంగా ఉండటం స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను పెంచాయి.

గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే 7 శాతం వృద్ధితో రూ.1.77 లక్షల కోట్లుగా జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం.. ఆర్థిక వ్యవస్థ మెరుగవుతోందన్న సంకేతాలు వెలువడ్డాయి. 2025లోనూ ఐటీ కంపెనీలు మెరుగైన రెవెన్యూ వృద్ధిని కనబరిచే అవకాశం ఉందన్న అంచనాలతో ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుకు కారణమైంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా మాత్రమే నష్టపోయింది. మిగిలిన షేర్లు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్ 6 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి.. 85.75కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2649 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి