Gold: కొత్త ఏడాదిలో కనకమ్మ దారి ఎటు?.. కొంటే బెటరా.. ఆగితే మంచిదా..?

ఒక్క ఏడాదిలో 30 శాతం పెరిగింది. గత రెండేళ్లలో 51 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో ఏకంగా 114 శాతం పెరిగి రెండింతలు దాటింది బంగారం ధర. మరి.. ఈ ఏడాది ఎంత పెరుగుతుంది..? లక్ష మైలురాయిని చేరుకోడానికి ఇంకా ఎంత దూరముంది? ఒకవేళ అదే జరిగితే రేపటిరోజున బులియన్ మార్కెట్ ముఖచిత్రం ఎలా మారబోతోంది..? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల.. కాదుకాదు.. మిలియన్ క్యారెట్ల ప్రశ్న. నాటోన్లీ గోల్డ్.. వెండి, ప్లాటినమ్, డైమండ్ ధరలు సైతం ఈ ఏడాది డిబేటబుల్‌ టాపిక్‌గా మారబోతున్నాయి.

Gold: కొత్త ఏడాదిలో కనకమ్మ దారి ఎటు?.. కొంటే బెటరా.. ఆగితే మంచిదా..?
Gold
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 02, 2025 | 9:37 PM

కొత్త క్యాలెండర్.. మరి జిందగీలు కూడా కొత్తకొత్తగా మెరవాలిగా..? ఆభరణాల మీద మనకున్న ఆత్రాన్ని అంతోఇంతో తీర్చుకోవాలిగా.. అంటూ కొత్త బంగారు లోకంవైపు ఆశగా చూస్తోంది ప్రపంచం. కానీ.. ఆర్నమెంటల్ మెటల్స్ ధరలన్నీ పెరుగుదల బాట పట్టి ఆకాశం వైపే చూస్తున్నాయి. ముఖ్యంగా పసిడి ధరలు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరగడం మొదలెట్టాయి. కొత్త సంవత్సరంలో కొనుగోలుదార్లకు చుక్కలు చూపిస్తానంటోంది బంగారం ధర.

ఇవాళ్టికివ్వాళ భాగ్యనగరంలో పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఎంత అంటే.. అక్షరాలా 80 వేలకు అటూఇటూ అనే మాటే వినిపిస్తోంది. అతిత్వరలో 90 వేల మార్క్ టచ్‌ ఔతుందని.. లక్ష కూడా దాటిపోవచ్చని రకరకాల అంచనాలు.. ఊహాగానాలు. బంగారాన్ని మించిన బెస్ట్ ఇన్వెస్టిమెంట్ మరొకటి లేదంటున్న మార్కెట్ నిపుణులు.. బంగారం ధరల భవిష్యత్తేంటో తేల్చేస్తున్నారు. పసిడి ప్రియులైతే బెంబేలెత్తిపోతున్నారు.

గత ఐదేళ్లలో బంగారం ధరల యవ్వారం ఏంటన్నది చూస్తే.. మైండ్ బ్లాకవ్వడం ఖాయం. ఎందుకంటే.. 2017లో 30 వేలున్న పదిగ్రాముల బంగారం.. 2019లో 35 వేలకు, 2022లో 52 వేలకు చేరింది. 2023లో మరో పదివేలు పెరిగి 65 వేలకు చేరింది. గత ఏడాది 22 క్యారెట్ల బంగారం ధర 53 వేలకు అటూఇటూ కదిలేది. ఇప్పుడా జర్నీ 80 వేల దాకా చేరి.. జనవరి నెలాఖరులో ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేస్తా అంటూ సంకేతాలిస్తోంది.

ఒక్క ఏడాదిలో 30 శాతం.. గత రెండేళ్లలో 51 శాతం.. గత ఐదేళ్లలో 114 శాతం పెరిగింది బంగారం ధర. అంటే.. పసిడిపై పెట్టుబడి పెట్టినవాళ్లకు నాలుగేళ్లలోనే రెండింతలకు పైగా లాభాన్ని చూపించి.. డబుల్ ధమాకా కొట్టించింది. పెరుగుదల ఇదే దామాషాలో కంటిన్యూ ఐతే.. ఈ ఏడాది చివరికల్లా ధర 30 శాతం పెరిగి.. లక్ష మార్క్ టచ్ ఔతుందన్నది ఒక అంచనా. ఎందుకంటే.. బంగారం విషయంలో తగ్గుదల తాత్కాలికం.. పెరుగుదల మాత్రం శాశ్వతం.

కానీ.. నెలన్నర కిందట బులియన్ మార్కెట్‌లో నడిచిన డౌన్‌ట్రెండ్ కొనుగోలుదారుల్లో వణుకు పుట్టించింది. నవంబర్ ఫస్ట్ వీక్‌లో బంగారం ధరలు అనూహ్యంగా తగ్గిపోయాయి. 80 వేలు దాటిన తర్వాత చిన్నపాటి కరక్షన్ పాయింట్ వచ్చింది. వెయ్యిరూపాయలు అటుఇటు తగ్గొచ్చు అంతేకదా అనుకున్నారు. కానీ.. ఆ తగ్గుదల మామూలుగా లేదు. రెండేరెండురోజుల్లో ఏకంగా ఐదు వేల కరెక్షన్ వచ్చింది. 83 వేలున్న పదిగ్రాముల బంగారం ధర 75 వేల దిగువకు చేరుకోవడంతో.. మార్కెట్ మళ్లీ దిగాలుపడింది. పెరుగుతుందన్న ఆశతో అంతోఇంతో కొనిపెట్టుకున్న వాళ్లంతా గొల్లుమన్నారు.

ముఖ్యంగా అమెరికా ఎన్నికల ఫలితాలొచ్చాక బంగారం ధరల్లో చెప్పుకోదగ్గ తగ్గుదల నమోదైంది. ధరలు పాతాళాన్ని తాకుతాయని, పెట్టుబడి పెట్టిన వాళ్లు అమ్మేసుకోవడం బెటర్ అనీ టాక్ నడిచింది. ఇది వాస్తవం కూడా. గెలుపు ఢంకా మోగించిన ట్రంప్‌కి యుద్ధం మీద ఆసక్తి లేదు గనుక.. ఉక్రెయిన్, ఇజ్రాయల్‌లో కమ్ముకున్న యుద్ధమేఘాలు కనుమరుగౌతాయని అందరూ అనుకున్నారు. దాంతోపాటే.. బంగారం కొనుక్కుని దాచుకోవాలనే సెంటిమెంట్ కూడా బలహీనపడింది. అటు.. అక్టోబర్ నుంచి ఆరునెలల పాటు గోల్డ్‌ దిగుమతుల మీద హోల్డ్‌ బటన్‌ నొక్కి పెట్టింది చైనా. గోల్డ్ ఇంపోర్ట్‌లో మేజర్ వాటా డ్రాగన్ కంట్రీదే గనుక ఇప్పుడది వెనకడుగు వెయ్యడంతో.. బంగారం మీద ప్రపంచం మొత్తానికి ఆసక్తి తగ్గి.. డిమాండ్ అమాంతం పడిపోయింది. కానీ.. ఆ పతనం రెండు వారాలే కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ అదే జోరు. ట్రంప్ పదవీప్రమాణ సమయం దగ్గర పడ్డంతో.. ట్రంప్ మైండ్‌సెట్ ఎటు మళ్లుతుందో అనే డైలమాతో పసిడి ధర యధావిధిగా పరుగు లంకించుకుంది.

అటు.. స్టాక్‌మార్కెట్లలో అప్‌ అండ్ డౌన్స్‌ కూడా గోల్డ్ మార్కెట్ మూమెంట్స్‌ని బలంగా శాసిస్తున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవడంతో ఒకానొక సమయంలో మన దేశీయ మార్కెట్లు ఢమాల్న పడిపోవడం.. యూఎస్‌లో ఈక్విటీ ఇన్‌వెస్ట్‌మెంట్స్ పెరగడం..! ఇటువంటి అనుమానాస్పద పరిణామాల నేపథ్యంలో మళ్లీ డొమెస్టిక్ ఇన్వెస్టర్లకు పసిడి మీద మక్కువ పెరిగింది. ప్రస్తుతానికి పెట్టుబడికి మంచి మార్గం బంగారమే అనే క్లారిటీ ఐతే వచ్చేసింది. బంగారం అనేది లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇవాళ కొని రేపు అమ్మే తరహా కాదు కనుక.. గోల్డ్ ఇన్వెస్టర్లు భయపడాల్సిన పనే లేదు. బంగారం ధర తగ్గడం తాత్కాలికమే.. అనే భరోసా ఉంది కనుక బేఫికర్. దాని ఫలితమే.. 90 వేల మార్క్ దిశగా నడుస్తున్న ఈ గోల్డ్‌ రన్. కానీ.. ఈ పరుగు ఎందాకా..? కొత్త సంవత్సరంలో లక్ష మైలురాయిని టచ్ చేస్తుందా అనేది ఆ ట్రంప్ మహాశయుడి చేతల మీదే డిపెండై ఉంది.

ఒకవేళ ప్రెసిడెంట్ కుర్చీనెక్కిన తర్వాత ట్రంపువారు నెగిటివ్ నిర్ణయాలు తీసుకుంటే.. బంగారం ధరలు మళ్లీ భగ్గుమని మండడం గ్యారంటీ. ఆ పక్కనే ఉన్న మిగతా ఖరీదైన మెటల్స్ కూడా మెంటలెక్కిస్తున్నాయి. కిలో వెండి ధర ప్రస్తుతం 98 వేల దగ్గర ఫిక్సయింది. నెలరోజులుగా ఊరిస్తున్న లక్షమార్క్‌ను రేపో మర్నాడో టచ్ చేసే అవకాశముంది. 2018లో 41 వేలున్న కిలో వెండి ధర.. 2020లో 63 వేలకు చేరింది. ఇక్కడ అండర్‌లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2022- 2023కు మధ్య ఒక్క ఏడాదిలోనే 23 వేలు పెరిగింది వెండి ధర. మొత్తంగా ఐదెళ్లలో 150 శాతం పెరిగి లకారానికి చేరుకుంది. అంటే.. 2025 క్యాలెండర్లో వెండి ధరలు కూడా చుక్కలు చూపించడం ఖాయమన్నమాట.

ఆభరణాల మార్కెట్లో మోస్ట్ వ్యాల్యుబుల్ మెటల్ ఏదంటే.. బంగారం, ప్లాటినమ్.. ఈ రెండు పేర్లే టక్కున గుర్తుకొస్తాయి. వేల సంవత్సరాలుగా హయ్యస్ట్ మార్కెట్ వ్యాల్యూ ఉన్న మెటల్‌గా గోల్డ్‌కే పేరుంది. కానీ.. జ్యూవెలరీ ప్రపంచంలో స్టేటస్ సింబల్‌గా అత్యంత వేగంగా ఎదిగింది మాత్రం ప్లాటినమే. ఒకప్పుడు ఎంగేజ్‌మెంట్ రింగ్స్, వెడ్డింగ్ రింగ్స్ కోసం మాత్రమే ప్లాటినమ్ వైపు చూసేవాళ్లు.. తర్వాత రెగ్యులర్ జ్యువెలరీని కూడా ప్లాటినమ్‌తోనే కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. లేటెస్ట్‌గా ఆ ట్రెండ్ కూడా రివర్స్ ఔతోంది. ఎలైట్ ఫ్యామిలీస్ కూడా ప్లాటినమ్‌ని పక్కకుపెట్టి గోల్డ్ వైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే.. గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అనేది అందరూ ఆమోదిస్తున్న గోల్డెన్ వర్డ్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి