Gold Loan: ఇరాన్-ఇజ్రాయిల్ వార్.. గోల్డ్ లోన్ తీసుకున్న వారికి బిగ్ అలర్ట్!
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారం ధరలు పెరిగి, సురక్షిత ఆస్తిగా మారుతోంది. ఇది గోల్డ్ లోన్ మార్కెట్‌ను గణనీయంగా పెంచుతోంది. గోల్డ్ లోన్‌లు తక్షణ నగదు అవసరాలకు ఉపకరించినా, తిరిగి చెల్లింపు ప్రణాళిక లేకుండా తీసుకుంటే ఆర్థిక నష్టాలు, బంగారం వేలం ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిణామాలతో బంగారం ధరలు ఇటీవల వేగంగా పెరుగుతున్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇటువంటి పెరుగుదలలు ఎక్కువగా భావోద్వేగ ఆధారితంగా ఉండి, పరిస్థితులు సద్దుమణిగితే ధరలు తిరిగి తగ్గే అవకాశమూ ఉంది. SMC గ్లోబల్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ AVP వందన భారతి ప్రకారం.. అనిశ్చితి సమయంలో వ్యాపారులు రిస్క్ తగ్గించేందుకు బంగారం కొనుగోళ్లు పెంచుతారు. కానీ దీర్ఘకాలంలో ప్రాథమిక ఆర్థిక అంశాలు మళ్లీ ప్రభావం చూపుతాయి. ఇదే సమయంలో బంగారం ధరల పెరుగుదల గోల్డ్ లోన్ మార్కెట్‌ను వేగంగా పెంచుతోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం గత ఏడాదిలో బంగారు రుణాలు సుమారు 125–128 శాతం పెరిగి 2025 చివరికి రూ.3.3 లక్షల కోట్లకు చేరాయి. బంగారం ధరలు పెరగడంతో అదే ఆభరణంపై ఎక్కువ రుణం పొందే అవకాశం ఏర్పడింది. అలాగే అసురక్షిత వ్యక్తిగత రుణాలపై కఠిన నిబంధనలు రావడం కూడా బ్యాంకులు, వినియోగదారులను గోల్డ్ లోన్ల వైపు మళ్లిస్తోంది.
BankBazaar CEO అధిల్ శెట్టి ప్రకారం.. RBI నియమాల ప్రకారం సాధారణంగా బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం మాత్రమే రుణంగా లభిస్తుంది. వడ్డీ రేట్లు సాధారణంగా 9 శాతం నుంచి 15 శాతం మధ్య ఉంటాయి. ఇవి వ్యక్తిగత రుణాల కంటే తక్కువైనా, మొత్తం ఖర్చు కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. అత్యంత ముఖ్యమైన విషయం EMIలు లేదా బుల్లెట్ చెల్లింపులు సమయానికి చేయకపోతే తాకట్టు పెట్టిన బంగారం వేలం వేయబడే ప్రమాదం ఉంది.
ఆర్థిక నిపుణుడు పరమదీప్ సింగ్ హెచ్చరిస్తూ బంగారం ధరలు ఎప్పుడూ ఒకే దిశలో కదలవని చెప్పారు. ధరలు 5–10 శాతం పడిపోయినా భద్రతా మార్జిన్ తగ్గి రుణగ్రహీతపై ఒత్తిడి పెరుగుతుంది. పడిపోతున్న మార్కెట్‌లో రుణదాతలు వేగంగా వేలం ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. అదనంగా బుల్లెట్ రీపేమెంట్ విధానం లేదా అసమాన నగదు ప్రవాహం ఉన్నవారికి తిరిగి చెల్లింపు భారం మరింత పెరగొచ్చు. గోల్డ్ లోన్ తక్షణ నగదు అవసరాలకు ఉపయోగపడినా, స్పష్టమైన రీపేమెంట్ ప్లాన్ లేకుండా తీసుకోవడం ఆర్థికంగా, భావోద్వేగపరంగా నష్టాన్ని కలిగించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
