EV Scooters Sale: ఆ రెండు కంపెనీలకు షాక్ ఇచ్చిన బజాజ్.. డిసెంబర్ సేల్స్‌లో గణనీయమైన పెరుగుదల
భారతదేశంలో 2024లో ఈవీ స్కూటర్ల అమ్మకాలు రికార్డులను సృష్టించాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఈవీ స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపడంతో అమ్మకాలు తారాస్థాయికి చేరాయి. అయితే ఓలా, టీవీఎస్, బజాజ్ కంపెనీల స్కూటర్లనే ప్రజలు ఎక్కువగా ఇష్టపడ్డారు. కానీ సంవత్సరాంతంలో ఓలా సర్వీస్‌పై వచ్చిన వార్తల నేపథ్యంలో ఓలా కంపెనీ స్కూటర్ల సేల్స్ కంటే టీవీఎస్, బజాజ్ స్కూటర్ల సేల్స్ పెరిగాయి.
2024 డిసెంబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో టీవీఎస్ మోటార్, ఓలా ఎలక్ట్రిక్ అధిగమించి బజాజ్ ఆటో అగ్రస్థానానికి చేరుకుంది. వాహన్ పోర్టల్ ప్రకారం బజాజ్, టీవీఎస్ కంపెనీలు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు మార్కెట్ వాటా 19 శాతానికి పడిపోయి మూడో స్థానానికి పడిపోయింది. మొత్తంమీద గత నెలలో 73,316 యూనిట్ల ఈవీ స్కూటర్ల విక్రయాలను నమోదు చేసింది. బజాజ్ చేతక్ ఈవీ అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే టీవీఎస్ ఐక్యూబ్ రెండో స్థానానికి పరమితమైంది. బజాజ్ ఆటో గత నెలలో 18,276 యూనిట్ల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలను నమోదు చేసింది.
బజాజ్ 2024 మొత్తంలో 1.93 లక్షల యూనిట్ల విక్రయాలతో మూడో అతి పెద్ద ఈవీ తయారీదారుగా ఉంది. అయితే భారతదేశంలో ఒక క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు లక్షల అమ్మకాలను దాటిన ఏకైక ఈవీ తయారీదారు అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. టీవీఎస్ మోటార్ భారతదేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారుల్లో 2.20 లక్షల యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్ రేసులో బజాజ్ చేతక్ ఈవీ గత నెలలో 17,212 యూనిట్లను అమ్మడంతో టీవీఎస్ ఐక్యూబ్‌ను అధిగమించింది. బజాజ్ కంపెనీ ఇటీవల విడుదల చేసిన చేతక్ 35 సిరీస్ ఎలక్ట్రిక్ అధునాతన ఫీచర్ల ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చేతక్ 35 సిరీస్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త చేతక్ ప్రారంభ ధర రూ.1.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
2024లో అతి పెద్ద ఈవీ తయారీదారుల్లో అగ్రస్థానంలో నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్‌లో కేవలం 13,769 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. అలాగే ఏథర్ ఎనర్జీ కూడా డిసెంబర్‌లో 10,421 ఈవీ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో 2024లో 11.4 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి. వీటిలో ఓలా ఎలక్ట్రిక్ నాలుగు లక్షల యూనిట్ల కంటే కొంచెం ఎక్కువగా విక్రయించింది. గత ఏడాది భారతదేశంలో జరిగిన మొత్తం ఈవీ విక్రయాల్లో ఈ విభాగం 59 శాతం వాటాను కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి