Gold: బంగారం ఇంట్లో కాదు.. ఇక్కడ పెడితే మీకు డబ్బే డబ్బు..
మీ బంగారం ఇంట్లో లేదా బ్యాంక్ లాకర్‌లో పెట్టారా..? దాని వల్ల మీకు నయా పైసా ఆదాయం ఉండదు. కానీ దాన్ని వేరే దగ్గర పెట్టి ప్రతి నెలా డబ్బు సంపాదించొచ్చ. బంగారం అమ్మకుండానే 2శాతం నుంచి 5శాతం వరకు ఆదాయం పొందవచ్చు. అది ఎలా వస్తుంది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతీయులకు బంగారం అంటే స్పెషల్ సెంటిమెంట్. పండగైనా, శుభకార్యమైన బంగారం కొనాల్సిందే. అయితే చాలా మంది బంగారాన్ని బీరువాలో లేదా బ్యాంక్ లాకర్‌లో దాచిపెడతారు. అది లాకర్‌లో ఉంటే.. దాని విలువ పెరుగుతుంది తప్ప.. మీకు ప్రతి నెల ఆదాయం ఇవ్వదు. ఇది ఒక రకంగా పనికిరాని ఆస్తి లాంటిది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. మీ బంగారాన్ని అమ్ముకోకుండానే దాని ద్వారా డబ్బు సంపాదించేందుకు మంచి మార్గాలు వచ్చాయి. మీరు బంగారాన్ని అమ్మకుండానే దాని ద్వారా కొంచెం డబ్బు సంపాదించాలంటే ఈ రెండు పద్ధతులు మీకు బెస్ట్ ఆప్షన్.
గోల్డ్ లీజింగ్
ఇది కొత్త ఆలోచన. మీ బంగారాన్ని ఆభరణాలు చేసే పెద్ద షాపులకు అద్దెకు ఇవ్వొచ్చు. దీనికి బదులుగా వాళ్లు మీకు ఏడాదికి 2 నుంచి 5శాతం వరకు రాబడి ఇస్తారు. ఈ డబ్బును రూపాయల్లో కాకుండా బంగారం రూపంలో ఇస్తారు. కాబట్టి రేపు బంగారం ధర పెరిగినా, మీ రాబడి కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.
గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్
ఇది ప్రభుత్వ సాయంతో బ్యాంకులు నడిపే పథకం. మీ నగలు లేదా కడ్డీలను బ్యాంకులో డిపాజిట్ చేయాలి. బ్యాంక్ మీకు ఏటా 2.25 నుంచి 2.5శాతం వరకు వడ్డీ ఇస్తుంది. లాకర్‌లో ఉంచితే డబ్బు కట్టాలి. అదే బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే డబ్బు వస్తుంది.. భద్రత కూడా ఉంటుంది. ప్రస్తుతం 1 నుంచి 3 ఏళ్ల పథకాలు అందుబాటులో ఉన్నాయి.
కష్టం వస్తే అస్సలు అమ్మొద్దు
ఇంట్లో డబ్బు అవసరమైనప్పుడు వెంటనే బంగారాన్ని అమ్మేయాలనిపిస్తుంది. కానీ ఇది నష్టపోయే నిర్ణయం. అత్యవసరంలో బంగారాన్ని అమ్మేయకుండా, గోల్డ్ లోన్ తీసుకోండి. మీ బంగారాన్ని బ్యాంకులో పెట్టి దాని విలువలో 85శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. మీ బంగారం బ్యాంకులో భద్రంగా ఉంటుంది. మీరు నెమ్మదిగా ఈఎంఐ కట్టి, తర్వాత మీ బంగారాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు. అమ్మేసి శాశ్వతంగా పోగొట్టుకోవడం కంటే ఇది చాలా మంచిది.
అమ్మాల్సి వస్తే.. ఎప్పుడు అమ్మాలి?
మీరు అమ్మేయాలనుకుంటే, ఒక లెక్క గుర్తుంచుకోండి.. బంగారం కొనేటప్పుడు మీరు మేకింగ్ ఛార్జెస్, GST అదనంగా కడతారు. అమ్మేటప్పుడు ఆ కూలీ డబ్బు తిరిగి రాదు. కాబట్టి, మీకు లాభం రావాలంటే, బంగారం ధర మీరు కొన్న ధర, మేకింగ్ ఛార్జీలను మించి పెరిగినప్పుడే అమ్మడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




