Tirumala: తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం పేరిట బురిడీ.. కేసు నమోదు చేసిన టీటీడీ విజిలెన్స్ పోలీసులు
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం పేరుతో భక్తుల్ని దళారీ ముఠా బురిడీ కొట్టించింది. హైదరాబాద్ కు చెందిన వేణు అనే భక్తుడు అభిషేక్ ముఠా చేతిలో దారుణంగా మోసపోయాడు. అయితే టీటీడీ విజిలెన్స్ పోలీసులు కనిపెట్టడంతో 4 బ్రేక్ దర్శనం టికెట్ల కోసం రూ. 11 వేలు నగదు వసూలు చేసిన ఆ దళారి ముఠా తిరుమలలోఅడ్డంగా బుక్కైంది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం పేరుతో భక్తుల్ని దళారీ ముఠా బురిడీ కొట్టించింది. హైదరాబాద్ కు చెందిన వేణు అనే భక్తుడు అభిషేక్ ముఠా చేతిలో దారుణంగా మోసపోయాడు. అయితే టీటీడీ విజిలెన్స్ పోలీసులు కనిపెట్టడంతో 4 బ్రేక్ దర్శనం టికెట్ల కోసం రూ. 11 వేలు నగదు వసూలు చేసిన ఆ దళారి ముఠా తిరుమలలోఅడ్డంగా బుక్కైంది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ కి చెందిన ఫోటోగ్రాఫర్ కామిశెట్టి వేణు కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు రావాలని అనుకుంది. ఆన్ లైన్ లో దర్శనం టికెట్ల కోసం ప్రయత్నించింది. దొరకకపోవడంతో తిరుపతికి చెందిన అభిషేక్ అనే దళారిని సంప్రదించింది.వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కోసం అభిషేక్‌తో కామిశెట్టి వేణుకు బేరం కుదిరింది. ఇక దర్శనం అవుతుందని తిరుపతికి వచ్చింది. ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వేణు ఈ నెల2న తిరుమలకు వచ్చారు. అభిషేక్ కు నగదు ట్రాన్స్ ఫర్ చేసిన వేణు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోసం ఫోన్ లో సంప్రదించాడు. అభిషేక్ శీను అనే మరో దళారి ని రంగంలోకి దింపి తిరుమలలోని ఏటీసీ సర్కిల్ వద్ద టికెట్లను కలెక్ట్ తీసుకోవాలని చెప్పడంతో అక్కడికి చేరుకున్న వేణు అతని స్నేహితులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కట్టబెట్టారు. స్కానింగ్ కౌంటర్ లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ సంస్థలో పనిచేసే శివ నారాయణ ఉంటాడని, దగ్గరుండి దర్శనానికి అనుమతి ఇస్తారని చెప్పారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న వేణుకు అనుమానం వచ్చింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి తాము డబ్బు చెల్లిస్తే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ఉందని అనుమానం వచ్చిన వేణు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది దళారీ మోసం వ్యవహారం.
ఈ మేరకు టీటీడీ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శంకర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుమల 2 టౌన్ పోలీసులు ఇప్పటికీ ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. శ్రీవారి దర్శనం చాటున దళారీ సాగిస్తున్న వ్యాపారం రట్టయింది. అదే రోజు దాదాపు 30 మందిని వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో స్పెషల్ ఎంట్రీ టికెట్ల స్కాన్ చేసి పంపినట్లు గుర్తించిన పోలీసులు దళారీ ముఠా గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు. ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..