ఆటపాటలతో విద్య.. ఇకపై స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..! విద్యార్థులతో కలిసి టీచర్లు, IAS లు..
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాఠశాల విద్యార్థుల కోసం "మన్యం డాన్స్" అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య అనుబంధాన్ని పెంచడానికి, పిల్లలలో సిగ్గు, భయాన్ని పోగొట్టి సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది తోడ్పడుతుంది. ముఖ్యమంత్రి సైతం మెచ్చిన "ముస్తాబు" కార్యక్రమం తర్వాత ఇది మరో విజయం. ఈ డాన్స్ పిల్లలలో మానసిక ఉల్లాసాన్ని నింపుతోంది.

ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ N. ప్రభాకర్ రెడ్డి ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్నారు. వెనుబడిన జిల్లా అయిన పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాల విద్యార్థుల కోసం ఆయన రూపొందిస్తున్న వినూత్న కార్యక్రమాలు మంచి ఆదరణను పొందుతున్నాయి. స్కూల్ విద్యార్థుల కోసం జిల్లాలోని పాఠశాలల్లో ఆయన ప్రవేశ పెట్టిన ముస్తాబు కార్యక్రమం బాగా ఫేమస్ అయింది. ఆ కార్యక్రమం సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునీ సైతం ఆకట్టుకుంది. ఇటీవల విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మన్యం జిల్లాలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్కూల్ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని కితాబు ఇవ్వటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దానిని అమలు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు. అదే స్పూర్తితో తాజాగా ఇపుడు “మన్యం డాన్స్” అనే పేరుతో మరో వినూత్న కార్యక్రమాన్ని స్కూల్ విద్యార్థుల కోసం రూపొందించి జిల్లాలో అమలు చేస్తున్నారు కలెక్టర్ ప్రభాకర రెడ్డి.
పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య చక్కటి అనుబంధాన్ని పెంపొందించటానికి, పిల్లల్లో సిగ్గు, భయం, బిడియం వంటివి పోగొట్టి వారిలో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమమే ఈ మన్యం డాన్స్ కార్యక్రమం. పాఠశాలల్లో ప్రతి శనివారం ఉదయం ప్రేయర్ సమయంలోనే కాసేపు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం రోజంతా పిల్లల్లో జోష్ నిపుతాదని, మానసికంగా, ఉల్లాసంగా, శారీరకంగా చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారు అనేది కార్యక్రమం ఉద్దేశం. పైగా ఈ కార్యక్రమం పిల్లలలో స్కూల్ అంటే హ్యాపీ వాతావరణాన్ని కలుగజేస్తుందనటం లోనూ సందేహం లేదు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొంటున్నారు.
వీడియో ఇక్కడ చూడండి…
తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం తలవరం గ్రామంలోని ప్రభుత్వ ZP ఉన్నత పాఠశాలలో జరిగిన మన్యం డాన్స్ కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్(IAS )పాల్గొన్నారు. కాసేపు విద్యార్థులతో కలిసిపోయి వారితో పాటు హుషారుగా స్టెప్పులేసారు. ఏరోబోటిక్స్ లాంటివి చేశారు. సబ్ కలెక్టర్ స్వప్నిల్ స్టెప్పులు చూసేవారిని ఆకట్టుకున్నాయి. మొత్తానికి మన్యం డాన్స్ పేరుతో తమతో పాటు ఉపాధ్యాయులు, అధికారులు స్టెప్పులు వేస్తుండటం పాఠశాల వాతావరణాన్ని కాసేపు ఆహ్లాద పరుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




