వంటగది సామాగ్రి, ఎయిర్ కండిషనర్లు కొనే వారికి బిగ్ షాక్..! వెండి, బంగారం బాటలోనే ఈ లోహం..!
కొత్త సంవత్సరంలో ఎయిర్ కండిషనర్ కొనాలని ఆలోచిస్తున్నారా..? లేదంటే, మీ ఇంటి పెంచుకోవడానికి కొన్ని ఇత్తడి, రాగి వంటపాత్రలు, ఫ్యాన్సీ బాత్‌వేర్ వంటివి కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే, మీకు ఇది షాకింగ్ న్యూస్ కావొచ్చు..ఇటీవలి నెలల్లో అనేక గృహోపకరణాలలో ఉపయోగించే ఎర్రటి లోహం బంగారం, వెండితో పోటీ పడి పెరుగుతోంది. దీంతో మీరు ఎక్కువ ధర చెల్లించాల్సి రావచ్చు. గత నెలలో రాగి ధరలు టన్నుకు రికార్డు స్థాయిలో $12,000 దాటాయి. ఇది 2009 తర్వాత అతిపెద్ద వార్షిక లాభాన్ని నమోదు చేసిందని బ్లూమ్‌బెర్గ్ డేటా చూపించింది.

రాగి, ఇత్తడి వంటి సంబంధిత వస్తువులు, పరికరాలు ప్రతి ఇంటి అవసరాల్లో ప్రధాన భాగంగా మారాయి. ఇంటి అందాన్నిపెంచుకోవడానికి చాలా మంది రాగి పాత్రలు, ఎయిర్ కండిషనర్, ఫ్యాన్సీ బాత్‌వేర్ కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇది మీ జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది. మీరు మునుపటి కంటే ఎక్కువ ధరలు చెల్లించాల్సి రావచ్చు. ఎందుకంటే.. రాగి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది రాగి ఉత్పత్తులను, ముఖ్యంగా గృహోపకరణాలను ప్రభావితం చేస్తోంది. మన్నికైన వస్తువులు, వంట సామాగ్రి, బాత్‌వేర్‌లను తయారు చేసే కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ధరలను పెంచే అవకాశం ఉంది.
మన్నికైన వస్తువులు, వంట సామాగ్రి, బాత్‌వేర్‌లోని కంపెనీలు వాటి వస్తువుల తయారీలోని రాగి, ఇత్తడి వంటి సంబంధిత పదార్థాలను పెద్ద మొత్తంలో ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్జిన్‌లను కాపాడుకోవడానికి ధరలను పెంచాలని నిర్ణయించాయి. చాలా కంపెనీలు దిగుమతులు, స్థానిక వనరుల మిశ్రమం ద్వారా రాగిని సేకరిస్తాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ధరల కదలికలు మొత్తం ధరలపై ప్రభావం చూపుతాయి.
రాగి, అల్యూమినియం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో ఉపకరణాలు, వంట సామాగ్రి విభాగంలో ధరలను 5-7శాతం పెంచుతామని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. న్యూట్రి-బ్లెండ్, తమ అధిక-పనితీరు గల మిక్సర్ గ్రైండర్ల వంటి అత్యంత ప్రజాదరణ పొందిన ఉపకరణాలకు రాగి ఒక ముఖ్యమైన పదార్థం. అధిక ధరలు మొత్తం ఉపకరణాల పరిశ్రమ అంతటా మార్జిన్లపై ఒత్తిడి తెస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
2025లో భారీగా పెరిగిన మెటల్ ధరలు 2026 మొదట్లో కూడా బలంగా ఉన్నాయి. MCXలో కాపర్ ధర రూ.1,270-1,300( 1 kg) ల దగ్గరగా ఉంది. 2025లో 42-48శాతం పెరిగింది. గత శుక్రవారం జనవరి 3 వరకు రాగి ధరలు కిలోగ్రాముకు దాదాపు రూ.1,300కి చేరుకున్నాయి. ఇది 6శాతం కంటే ఎక్కువ పెరుగుదల. అటు, ఇత్తడి ధరలు కూడా 15-18శాతం పెరుగుదల నమోదు చేసుకుంది. కంపెనీలు అధిక ఖర్చులను భరించలేవు. అప్పుడు వినియోగదారులపై ప్రభావం పడుతుంది. గత సంవత్సరం, వడ్డీ రేట్లు తగ్గడం, డాలర్ బలహీనపడటం, చైనా ఆర్థిక వృద్ధి అంచనాలు మెరుగుపడటంతో రాగి, అల్యూమినియం, లిథియం వంటి ఇతర పారిశ్రామిక లోహాల ధరలు పెరిగాయి. సరఫరా అంతరాయాలు, విధాన మార్పులు, AI పై భారీ వ్యయం కూడా ధరలను పెంచాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




