గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది.. దాని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటంటే..?
గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..? గ్యాస్ సిలిండర్ల ఎరుపు రంగు వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. అంతేకాకుండా గ్యాస్ లీక్ అయినప్పుడు వచ్చే ఆ వింత వాసన వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మనం ప్రతిరోజూ వంటగదిలో గ్యాస్ సిలిండర్‌ను చూస్తుంటాం. గృహ వినియోగం కోసం వాడే సిలిండర్లు ఎరుపు రంగులో ఉంటే, హోటళ్లలో వాడేవి నీలం రంగులో ఉంటాయి. అసలు సిలిండర్లకు ఎరుపు రంగునే ఎందుకు వేస్తారు? గ్యాస్ లీక్ అయినప్పుడు వచ్చే ఆ ఘాటైన వాసన వెనుక ఉన్న కారణమేంటి? అనే ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎరుపు రంగు వెనుక ఉన్న 3 ప్రధాన కారణాలు
భారతదేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్లకు ఎరుపు రంగు కేటాయించడం వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి..
ప్రమాదానికి హెచ్చరిక
రంగుల శాస్త్రం ప్రకారం ఎరుపు రంగు ప్రమాదానికి సంకేతం. LPG గ్యాస్ అత్యంత వేగంగా మండే స్వభావం కలిగి ఉంటుంది. కాబట్టి వినియోగదారులు దానిని వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించడానికి ఈ రంగును ఉపయోగిస్తారు.
దూరం నుంచే గుర్తింపు
ఎరుపు రంగు కాంతికి తరంగదైర్ఘ్యం ఎక్కువ. దీనివల్ల చీకటిలో లేదా మసక వెలుతురులో కూడా ఎరుపు రంగు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సిలిండర్‌ను సులభంగా గుర్తించేందుకు ఇది సహాయపడుతుంది.
వాయువుల గుర్తింపు
మార్కెట్లో రకరకాల గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. ఉదాహరణకు బూడిద రంగులో కార్బన్ డయాక్సైడ్, నీలం రంగులో నైట్రస్ ఆక్సైడ్ ఉంటాయి. కేవలం రంగును చూసి అది ఏ రకమైన గ్యాసో గుర్తించేందుకు వీలుగా LPG కి ఎరుపు రంగును కేటాయించారు.
గ్యాస్ వాసన వెనుక అసలు నిజం
నిజానికి మనం వాడే ఎల్పీజీ గ్యాస్‌కి అసలు వాసనే ఉండదు. అది ఒక వాసన లేని వాయువు. కానీ గ్యాస్ లీక్ అయినప్పుడు ఎటువంటి వాసన లేకపోతే భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా గ్యాస్ తయారీ సమయంలో దానికి ఇథైల్ మెర్కాప్టాన్ అనే రసాయనాన్ని కలుపుతారు. దీనివల్ల గ్యాస్ లీక్ అవ్వగానే ఒక రకమైన ఘాటైన వాసన వస్తుంది. ఆ వాసన రాగానే గ్యాస్ లీకేజీని గుర్తించి మనం ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోగలుగుతున్నాం.
దేశంలో LPG ప్రస్థానం
మన దేశంలో 1955లో ముంబైలో తొలిసారిగా ఎల్పీజీ సిలిండర్ల వాడకం మొదలైంది. దేశవ్యాప్తంగా సామాన్యులకు కూడా గ్యాస్ సౌకర్యాన్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించి, సబ్సిడీ ధరలకే సిలిండర్లను పంపిణీ చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




