Konaseema: కోనసీమలో బ్లోఅవుట్.! తాజా పరిస్థితి ఇదే.. ఇంకా అదుపులోకి రాని మంటలు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అగ్గి ఇంకా చల్లారలేదు, బ్లో ఔట్‌కు కారణం నిర్లక్ష్యమా? టెక్నికల్ సమస్యా? నిజాలేవైనప్పటికీ పరిస్థితి మాత్రం నివురు గప్పిన ముప్పులా వుంది. ONGC టెక్నికల్ టీమ్స్ సహా పోలీసులు,ఫైర్ టీమ్స్ ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ వివరాలు ఇలా..

ఆకాశన్నంటేలా ఎగిసిన అగ్నిజ్వాలలు ఎగిశాయి. కొబ్బరి తోటల్ని ఆజ్యంగా మలుచుకున్నాయి. సైరన్ సౌండ్ కన్నా వేగంగా ఎగిసిన మంటలు 100 అడుగుల పైకి చెలరేగాయి..ధీటుగా పోటెత్తిన పొగమేఘాలు కిలోమీటర్ల మేర వరకు ప్రభావం చూపాయి.కరెంట్ సరఫరా నిలిపివేయడంతో గ్రామాలు చీకట్లో మగ్గాయి. జనం బిక్కుబిక్కుమంటూ జాగారం చేశారు. ఓఎన్జీసీ ఎక్స్‌పర్ట్స్ టీములు, అధికార యంత్రాంగం ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేసినా సరే గ్యాస్ మంటలు అదుపులోకి రావడంలేదు. ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ దగ్గర బావిలో 20 వేల నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉబికి వస్తోంది.20 మీటర్ల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. పరిస్థితి తీవ్తంగా ఉండడంతో పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలించారు అధికారులు.
గ్యాస బ్లో ఔట్ అయినప్పటి నుంచి ఏ ఇంట్లో పొయ్యి వెలగలేదు.పల్లెల్లో చీకట్లు కమ్ముకున్నాయి. పచ్చని కోనసీమ గుండెలపై గ్యాస్ మంటలు ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. అదుపు చేయడానికి ఇంకెంత టైమ్ పడుతుందో క్లారిటీ రావడంలేదు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారయ యంత్రాంగాన్ని ఆదేశించారు, మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ మహేష్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.
ప్రస్తుతానికైతే ఇంకా కోనసీమ బ్లోఅవుట్ మంటలు అదుపులోకి రాలేదు. ఇరుసుమండ బ్లోఅవుట్ దగ్గర ఆపరేషన్ కొనసాగుతోంది. గూడపల్లి-1 కాలువ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ చేపట్టారు. పైపులు వేసి నిరంతరం నీటిని జల్లుతున్నారు ఫైర్ సిబ్బంది. అడ్వాన్స్‌డ్ వాటర్ టెండర్లను మోహరిస్తున్నారు. ఢిల్లీ, ముంబై నుంచి స్పెషల్ టీమ్స్ వస్తున్నాయి. అలాగే వాటర్ అంబ్రెల్లా ఏర్పాటు చేశారు అధికారులు.




