Telangana: అటు వర్షం, ఇటు చలి.. ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో
అటు వర్షం, ఇటు చలి.. మళ్లీ దరువు మొదలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. వాతావరణ శాఖ ఏయే సూచనలు ఇచ్చిందో ఇప్పుడు ఇక్కడ చూసేద్దాం. మరి ఆ వివరాలు ఇలా.

తెలంగాణలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు డబుల్ డిజిట్‌కు చేరుకున్నాయి. చలి తీవ్రత కూడా తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా.. కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భద్రాచలంలో 18.2 డిగ్రీలు.. పటాన్‌చెరువులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అటు ఏపీ విషయానికొస్తే.. దిగువ ట్రోపో ఆవరణంలో కోస్తాంధ్రా, యానాం, రాయలసీమలో ఈశాన్య, తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. రాగల రెండు, మూడు రోజులు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అక్కడక్కడ పొగమంచు కురిసే ఛాన్స్ ఉంది. దక్షిణ, ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న అల్పపీడనం ఏర్పడిందని, 24 గంటల్లో మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 9వ తేదీ నుంచి వర్షాలు పడే ఆస్కారముందని పేర్కొంది. మరోవైపు కోస్తా జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. మరో నాలుగు రోజులు అల్లూరి, పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు దట్టంగా, మిగతా జిల్లాల్లో మోస్తరుగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నెల్లూరులో 21.6 డిగ్రీలుగా.. విజయనగరంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలుగా నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..




