Chandrababu: నామినేషన్ల వేళ టీడీపీలో కీలక పరిణామం.. 4 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు శాసనసభ స్థానాల్లో అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ టీడీపీలో అసలు ఏం జరుగుతోంది..? కొన్ని నియోజకవర్గాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థులను కాదని.. కొత్తగా మరొకరికి బీ ఫాంలు ఇస్తోంది టీడీపీ అధిష్ఠానం. ప్రస్తుతం నాలుగు స్థానాలకు అభ్యర్థులను మార్చినా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాలుగు శాసనసభ స్థానాల్లో అభ్యర్థులను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ టీడీపీలో అసలు ఏం జరుగుతోంది..? కొన్ని నియోజకవర్గాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థులను కాదని.. కొత్తగా మరొకరికి బీ ఫాంలు ఇస్తోంది టీడీపీ అధిష్ఠానం. ప్రస్తుతం నాలుగు స్థానాలకు అభ్యర్థులను మార్చినా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలో నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు ఖరారైంది. ఇప్పటికే ఏపీలో ప్రచారం జోరుమీద ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల మార్పు నిర్ణయం ఒక్కసారిగా రాజకీవర్గాల్లో షాక్ కు గురిచేసింది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఇప్పటికే అన్ని రకాల పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల పరిధిలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇలాంటి తరుణంలో అభ్యర్థుల మార్పు సంచలనంగా మారింది. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించినట్లు అధికారికంగా ప్రకటించింది టీడీపీ. మడకశిర ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెస్ రాజుకు కేటాయిస్తూ కీలక ప్రకటన వెలువరించింది. ఇక మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తికి కేటాయిస్తూ టీడీపీ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది.
ఈ క్రమంలోనే తమకు బీ ఫాంలు ఇచ్చేందుకు చంద్రబాబు నుంచి కాల్ రావడంతో ఇప్పటికే అధినేత నివాసానికి చేరుకున్నారు అభ్యర్థులు. గిడ్డి ఈశ్వరి, రఘురామ కృష్ణం రాజు, ఎమ్మెస్ రాజు, బండారు సత్యనారాయణలకు కాసేపట్లో బీఫాంలు ఇవ్వనున్నారు చంద్రబాబు. ఇదిలా ఉంటే ఉండి టీడీపీ టికెట్‌పై రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండిలో రేపు నామినేషన్ వేస్తున్నానన్నారు. బీఫాం తీసుకోవడానికి చంద్రబాబు నివాసానికి వచ్చానని తెలిపారు. ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని చెప్పారు. రామరాజు, తాను కలిసే ముందుకు వెళ్తాం అని పేర్కొన్నారు. ఎంపీ స్థానం ఆశించాను అయితే ఎమ్మెల్యే అయినా పర్వాలేదన్నారు. ఎంతమంది వచ్చినా ఉండిలో గెలిచి తీరుతానని ధీమాను వ్యక్తం చేశారు. రామరాజు, తాను రామలక్ష్మణుల మాదిరిగా కలిసి పనిచేస్తామన్నారు రఘురామకృష్ణరాజు. ఇక అసలు విషయానికి వస్తే గతంలో పాడేరు, మడకశిర, మాడుగుల నియోజకవర్గాల్లో తాము ఎంతో కాలంగా పార్టీకి పనిచేస్తున్నామని, అయితే పొత్తులో భాగంగా ఇతరులకు టికెట్ ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గిడ్డి ఈశ్వరి రెబల్ గా మారి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే క్రమంలో తనకు టికెట్ కేటాయించడంపై అచ్చెన్నాయుడు అడ్డుపడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. ఒకానొక సందర్భంలో వైసీపీలోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో వీరిని అభ్యర్థులుగా ప్రకటించి బీ ఫాంలు ఇచ్చేందుకు సిద్దమైంది టీడీపీ.




