జనసేన పార్టీ
జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన ఓ రాజకీయ పార్టీ. ఈ పార్టీని తెలుగు సినీ నటుడు పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న స్థాపించారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్‌లో పోటీ చేసినా.. కేవలం ఒక్క స్థానంలో మాత్రం గెలిచింది. నాటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి రెండుచోట్లా ఓడిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ ఒక్కరే విజయం సాధించారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా నాదెండ్ల మనోహర్, సభ్యుడికి నాగబాబు ఉన్నారు. సమ సమాజ స్థాపన, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ప్రశ్నించడం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ జనసేన పార్టీ సిద్ధాంతాలుగా ఉంది.
2014 జమిలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన పార్టీ మద్ధతు ప్రకటించింది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని విమర్శిస్తూ ఆ తర్వాత బీజేపీకి దూరం జరిగారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీకి దగ్గరయ్యారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ-బీజేపీ కూటమితో జనసేన చేతులు కలిపింది. పొత్తులో భాగంగా జనసేన ఏపీలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయనుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.