March New Rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు చేసిన కేంద్రం.. నేటి నుంచి ఇవి తప్పనిసరి..
ప్రతీ నెలా ఒకటో తేదీ వచ్చిందంటే చాలు.. కొత్త నిర్ణయాలు, రూల్స్ అమల్లోకి వస్తూ ఉంటారు. బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వాలు కొత్త నిర్ణయాలను ఒకటో తేదీ నుంచి అమలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి పలు నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి.

మార్చి 1 వచ్చేయడంతో ప్రజలను ప్రభావితం చేసే చాలా మార్పులు అమల్లోకి వచ్చాయి. మీ నెలవారీ పొదుపు, ఖర్చులు, బడ్జెట్‌ను ప్రభావితం చేసే నిర్ణయాలు నేటి నుంచి అమల్లోకి వచ్చేశాయి. రైల్వే టికెట్ల బుకింగ్ నుంచి యూపీఐ చెల్లింపులు, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ వరకు అనేక సవరణల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మార్చిలో కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ మార్పుల గురించి దేశంలోని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది. ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ సిలిండర్ ధరలు
ప్రతీ నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో చమురు మార్కెటింట్ కంపెనీలు మార్పులు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఇవాళ వాణిజ్య సిలిండర్ ధరలను రూ.30 మేర పెంచగా.. ఇంటి అవసరాల కోసం ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లలో ఎలాంటి మార్పులు జరగలేదు.
పెరిగిన ఏటీఎఫ్ ధరలు
ఇక విమాన ఛార్జీలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించే జెట్ ఇంధనం ధరలు పెరిగాయి. మార్చి 1 నుంచి ప్రధాన మోట్రో నగరాల్లో ఎయిర్ టర్బైన్ ఇంధనం ధరను రూ.4,977.24 నుంచి రూ.5,498.50కి పెంచారు. ఈ ఇంధనం ధరలు పెరిగినప్పుడు వీటి భారాన్ని ప్రయాణికులకు బదిలీ చేస్తాయి విమానయాన సంస్థలు
సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు
ఇక సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. అయితే రానున్న రోజుల్లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరిగే అవకాశముండటంతో వాటి ధరలను సవరించవచ్చు. గల నెలలో అదానీ టోటల్ గ్యాస్ వీటి ధరలను కిలోకు రూ.4.05 నుంచి రూ.4 తగ్గించింది. ఇక టోరెంట్ గ్యాస్ సీఎన్‌జీ ధరను కిలోకు రూ.3.50, పీఎన్‌జీ ధరను రూ.2 తగ్గించింది.
యూపీఐ చెల్లింపు వ్యవస్థలో ఛేంజ్
మార్చి 1 నుంచి అధిక విలువ గల లావాదేవీలకు యూపీఐ పిన్‌కు బదులు అదనపు భద్రత కోసం బయోమెట్రిక్స్ లేదా మల్టీ ఫాక్టర్ ప్రామాణీకరణను ఉపయోగించడం బ్యాంకులు తప్పనిసరి చేశాయి. దీంతో యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో మార్పులు జరగనున్నాయి.
సిమ్ బైండింగ్
మార్చి 1 నుంచి కొత్త సిమ్ బైండింగ్ నియమాలు అమల్లోకి వచ్చేశాయి. ఇక నుంచి వాట్సప్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, అరట్టై, షేర్ చాట్, జోష్, జియో చాట్, సిగ్నల్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాడాలంటే ఫోన్‌లో సిమ్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇంతకముందు కేవలం రిజిస్టర్ అయ్యే సమయంలో మాత్రమే సిమ్ కార్డు వెరిఫికేషన్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత సిమ్ తీసివేసినా యాప్స్ పనిచేసేవి. సైబర్ నేరాలను నిరోధించేందుకు సిమ్ బైండింగ్ నిబంధనను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇక వెబ్ వెర్షన్లలో కూడా 6 గంటలకు ఒకసారి యాప్స్ ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతాయి.
