Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ ప్రకంపనలు.. మహిళల అదృశ్యంపై వేడెక్కిన రాజకీయ దుమారం.. !
Andhra Pradesh News: మహిళల మిస్సింగ్‌కు సంబంధించి రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం ఏపీ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. ఈ ప్రకటనతో మరోసారి అధికార వైసీపీ, జనసేన మధ్య అగ్గి రాజుకుంది.
Andhra Pradesh News: దేశవ్యాప్తంగా మహిళల అదృశ్యంపై రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాచారం ఏపీలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వ డేటాను బట్టి చూస్తే ఏపీలో మహిళల అదృశ్యం కేసులు పెరుగుతున్నాయని తేటతెల్లం అవుతోందని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యలు నిజమేనని కేంద్రం ప్రకటనతో రూఢీ అయ్యిందని స్పష్టంచేశారు. ఏపీలో ఏం జరుగుతోంది? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ దీనిపై స్పందిస్తుందా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ అడిగినట్టుగానే దీనిపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. మహిళల అదృశ్యం కేసుల్లో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉన్నా కావాలనే దాన్ని పెద్దదిగా చూపుతున్నారని విమర్శించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. మహిళల అదృశ్యానికి వాలంటీర్ వ్యవస్థ కారణమని చెప్తున్న పవన్ కల్యాణ్ మాటలను తప్పుబట్టారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ లేకున్నా అక్కడ ఎందుకు మిస్సింగ్ కేసులు అధికంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో మహిళల అదృశ్యానికి వెనుక పవన్ కల్యాణ్ తీస్తున్న లవ్ స్టోరీ సినిమాలు కూడా కారణమని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
మరో వైపు మహిళల మిస్సింగ్ కేసులకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. 26 వేల మిస్సింగ్ కేసులు ఉన్నా అందులో 23,400 కేసులు ట్రేస్ చేసినట్టు ఆయన తెలిపారు. NCRBలోనూ ఈ వివరాలున్నాయని డీజీపీ వెల్లడించారు. మొత్తానికి మహిళల మిస్సింగ్ వ్యవహారం ఏపీలో హీటెక్కిన రాజకీయాలకు అగ్నికి ఆజ్యంగా మారింది.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి