అప్పుడు వారణాసి, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో అరుదైన పక్షి ప్రత్యక్షం..! భక్తితో పూజలు చేసిన గ్రామస్తులు..
మన దేశంలో గుడ్లగూబకు సంబంధించి ప్రజల్లో అనేక నమ్మకాలు ఉన్నాయి. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం. అందువల్ల ఈ పక్షి మంచి లేదా చెడు శకునంగా పరిగణిస్తారు. కొంతమంది గుడ్లగూబ కనిపిస్తే శుభ సూచకంగా భావిస్తారు. మరికొంతమంది అశుభంగా పరిగణిస్తారు. శకునశాస్త్రం ప్రకారం గుడ్లగూబను చూడటం చాలా చోట్ల శుభప్రదంగా భావిస్తారు. అలాంటిది అరుదైన తెల్ల గుడ్లగూబ కనిపిస్తే అది ఆ ఊరికే శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఆ ఊరు ఊరంతా ఆ గుడ్లగూబను దైవంగా భావించి పూజలు చేశారు. తెల్ల గుడ్లగూబ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అరుదైన తెల్ల గుడ్ల గూబ కనిపిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని ప్రజల విశ్వాసం. జీవితంలో అనుకున్న పనులు నెరవేరుతాయని, తెల్ల గుడ్లగూబను చూడటం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని అంటారు. దీన్ని చూడటం వల్ల మన పూర్వీకులు మనతో ఉన్నారని, వారి ఆశీర్వాదలు ఎప్పుడూ మనతోనే ఉంటాయని అంటారు. అందుకే, తమ గ్రామానికి వచ్చి తెల్ల గుడ్లగూబను దైవంగా భావించి పూజలు, భజనాలు చేశారు అక్కడి ప్రజలు. ఈ వింత సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారాలోని బెర్లా బ్లాక్‌లోని ఖమారియా గ్రామంలో చోటు చేసుకుంది.

Rare White Owl
స్థానిక ఒక రైతు ఫామ్‌హౌస్‌లో ఒక వింతైన, పూర్తిగా తెల్లటి డేగ గుడ్లగూబ కనిపించింది. ఈ వార్త వేగంగా గ్రామం అంతటా వ్యాపించింది. దీంతో గ్రామస్తులు తెల్ల గుడ్లగూబను పూజించడం ప్రారంభించారు. గత ఆగస్టు నెలలో వారణాసిలోనూ ఇలాంటి తెల్లటి గుడ్లగూబ కనిపించింది. ఆగస్టు 20న సాయంత్రం శయన హారతి తర్వాత ఆలయ శిఖరంపై ఈ తెల్లగుడ్లగూబ కనిపించింది.
ఫామ్‌హౌస్‌లో అరుదైన తెల్ల గుడ్లగూబ కనిపించిందనే వార్త గ్రామం అంతటా దావానలంలా వ్యాపించింది. నిమిషాల్లోనే పెద్ద సంఖ్యలో గ్రామస్తులు రైతు ఫామ్‌హౌస్‌కు రావడం ప్రారంభించారు. గ్రామస్తులకు, ఆ పక్షి కేవలం ఒక సాధారణ జీవిగా కాకుండా, దేవుడిగా మారింది. అక్కడికి భారీగా చేరుకున్న ప్రజలు పక్షి ముందు కీర్తనలు పాడటం, పూజలు చేయడం ప్రారంభించారు. చాలామంది పసుపు, కుంకుమ, పువ్వులు అర్పించారు. కొందరు పక్షికి కొబ్బరికాయలు కూడా కొట్టి నైవేధ్యం అర్పించారు. మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
బెర్లా బ్లాక్‌లోని ఖమారియా గ్రామంలో ఒక రైతు పొలంలో ఒక ప్రత్యేకమైన తెల్ల పక్షి కనిపించడంతో కలకలం చెలరేగింది. కానీ, దేవుడిగా భావించిన ప్రజలు పక్షికి పూజలు చేస్తుండటంతో ఆ మూగ జీవం మాత్రం భయంతో బిక్కుబిక్కుమంటూ ఓ మూలన నక్కింది. ఆ పక్షి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భక్తుల భారీ సమూహం, పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ పూజించటం చూసి ఆ పక్షి భయపడుతూ కనిపించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




