Telangana: ఏదైన ఫంక్షన్ జరుగుతుంది అనుకునేరు.. అది పోలింగ్ స్టేషన్..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.. అయితే ఓటర్లను ఆకట్టుకోవడం కోసం వరంగల్ జిల్లాలోని ఆ గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ వాహ్ అనిపిస్తున్నాయి.. ఓటర్లను అబ్బురపరిచాయి.. పోలింగ్ కేంద్రంలోకి అడుగు పెట్టగానే ఓటర్లంతా ఆశ్చర్య పోయారు.. అది పోలింగ్ స్టేషనా..! లేక పెళ్లి మండపమా..! ఏదైనా ఫంక్షన్ కి వచ్చామా..! అనే ఫీలింగ్ కలిగేలా ఆ పోలింగ్ కేంద్రాలను తీర్చిదిద్దారు.. పూర్తిగా పచ్చదనం ఉట్టిపడేలా చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవవిడత 3911 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగాయి. 12,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.. 29,917 వార్డులకు 71,071 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రెండో విడత 564 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.. వీటిలో 56 ఏకగ్రీవం అయ్యాయి ఒక స్థానంలో పోలింగ్ నిలిచిపోయింది.. మిగిలిన 507 గ్రామపంచాయతీలో 1,686 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.. 4937 వార్డులలో 916 ఏకగ్రీవం అయ్యాయి.. 4020 వార్డులకు పోలింగ్ జరిగింది.
ఐతే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఏ విధంగా వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహించారో ఇప్పుడు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం కోసం ఎన్నికల సిబ్బంది కూడా అదే విధంగా వినూత్న ఆలోచనలతో పోలింగ్ కేంద్రాలను తయారు చేశారు.. వరంగల్ జిల్లాలోని గీసుకొండ, గంగదేవిపల్లి నల్లబెల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు ఓటర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.. ఈ పోలింగ్ కేంద్రాలలో పూర్తిగా పచ్చదనం వుట్టిపడేలా గ్రీన్ పోలింగ్ స్టేషన్స్‌గా తయారు చేశారు..
వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద దేవి ఆలోచనతో పోలింగ్ కేంద్రాలు పెళ్లి మండపాలను తలపిస్తున్నాయి. ఓటర్లకు రంగులముగ్గులతో స్వాగతం పలుకుతూ అరిటాకు తోరణాలు, మామిడాకులు తోరణాలు, కొబ్బరిమట్టలు, బంతిపూల దండలతో పెళ్లి మండపంలా తీర్చిదిద్దారు. ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడం కోసం వచ్చే ఓటర్లకు వినూత్న రీతిలో స్వాగతం పలుకుతూ.. వారంతా ఏదైనా పెళ్లి మండపానికి, శుభకార్యానికి వెళ్తున్నామా అనే ఫీలింగ్ కలిగేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.. ఆహ్లాద భరిత వాతావరణంలో పోలింగ్ కేంద్రాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఒక్కరీని అక్కడ అరిటాకు తోరణాలు, బంతిపూల దండలు, సందేశాత్మక రాతలు అబ్బుర పరుస్తున్నాయి.
పోలింగ్ కేంద్రంలో కూడా పూర్తిగా గ్రీన్ మ్యాట్స్, గ్రీన్ బాక్స్‌లతో అలంకరించారు.. పోలింగ్ కేంద్రం ముందు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు సాగుచేసే వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు పలాలతో ఓటర్లకు స్వాగతం పలుకుతున్నారు.. అంతేకాదు పోలింగ్ కేంద్రాన్ని పూర్తిగా బంతిపూలు, ఆకులతో రూపుదిద్దారు.. ప్రతి మండలంలో రెండు పోలింగ్ కేంద్రాల చొప్పున ఈ విధంగా గ్రీన్ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటుచేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు..
పూర్తిగా పచ్చదనం ఉట్టిపడేలా కనిపిస్తున్న పోలింగ్ కేంద్రాల్లో ఆఖరికి మెడికల్ క్యాంపు కూడా అరిటాకులతో ఏర్పాటు చేశారు. సహజంగా ఎక్కడైనా మెడికల్ క్యాంపులకు ఏర్పాటుచేసిన టేబుల్స్ పైన క్లాత్, లేదంటే ప్లాస్టిక్ కవర్స్ కనిపిస్తాయి.. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా అరిటాకులు పరిచి దానిమీద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు..




